జైపూర్: మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేట్టింది. ఆరేళ్ల పాటు బీజేపీ నుంచి బహిష్కరించింది. (BJP Expels Spokesperson) బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ కుమార్ జాను ఇటీవల పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధంఖర్ రాజీనామా, ఇటీవల మరణించిన మాజీ గవర్నర్, గతంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్ పట్ల పార్టీ సీనియర్ నేతలు అవమానకరంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. వారిద్దరూ జాట్ వర్గానికి చెందినవారని తెలిపారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఆఫీస్ బేరర్లను జాను ప్రశ్నించారు. ‘సత్యపాల్ మాలిక్‌పై వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదు. బీజేపీ నేతలు చేస్తున్నది చాలా విచారకరం’ అని అన్నారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధి కృష్ణ కుమార్ జానుపై బీజేపీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. జాను వ్యాఖ్యలపై వివరణ కోరుతూ జూన్ 20న షో కాజ్ నోటీసు జారీ చేసినట్లు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్పర్సన్ ఓంకార్ సింగ్ లఖావత్ తెలిపారు. ‘తన చర్యలను సమర్థించడంలో ఆయన విఫలమయ్యారు. ఆయనను ఆరు సంవత్సరాలు బహిష్కరించాలని కమిటీ నిర్ణయించింది’ అని వెల్లడించారు.
Also Read:
Tejashwi Yadav | బీహార్ డిప్యూటీ సీఎంకు రెండు ఓటరు కార్డులు: తేజస్వి యాదవ్ ఆరోపణ
Woman Calls Lover Home Kills | ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి హత్య చేసిన మహిళ
Watch: విద్యార్థితో పాదానికి మసాజ్ చేయించుకున్న టీచర్.. వీడియో వైరల్