సోలన్: నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన పరివర్తన్ ప్రతిజ్ఞా ర్యాలీలో ప్రసంగించిన ఆమె.. బీజేపీని నమ్ముకుంటే ప్రజలను నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇకనైనా బీజేపీని నమ్మవద్దని, మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేందుకు కేంద్రం దగ్గర డబ్బులు లేకపోయినా, తనకు అనుకూలురైన బడా వ్యాపారులకు మాత్రం కోట్లల్లో రుణ మాఫీ చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ సర్కారు యువత, ఉద్యోగులు, మహిళల కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతో గత ఐదేండ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఈసారి కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రియాంక హామీ ఇచ్చారు. వాటిలో మొదటిది లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కాగా, రెండోది పాత పెన్షన్ స్కీమ్ అమలు అని చెప్పారు. ఈ ఉదయమే ఎన్నికల ప్రచారం ప్రారంభించడం కోసం సోలన్‌కు వచ్చిన ప్రియాంకాగాంధీ.. మా షూలినీ ఆలయ సందర్శన అనంతరం సభకు హాజరయ్యారు.