న్యూఢిల్లీ, జూలై 17: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా వారసుడి ఎంపికపై పార్టీకి, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉక్కు పిడికిలి నుంచి బీజేపీని విడిపించడానికి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తుండడంతో ఒకే ఒక పదవిపై రెండు పక్షాల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు వారు తెలిపారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందే జూలై 21 లోగా పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమితులు అవుతారని కొన్ని వారాల క్రితం వరకు బీజేపీ సీనియర్ నేతలు పలువురు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడం లేదని బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్లను ఈ నెల ప్రారంభంలో పార్టీ ఆమోద ముద్ర కోసం ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి పంపించినట్లు బీజేపీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే వీరిద్దరిలో ఎవరి పేరును ఆర్ఎస్ఎస్ ఆమోదించలేదని వారు చెప్పారు. అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, అమిత్ షాలకు రబ్బర్ స్టాంప్‌గా పనిచేసే వ్యక్తి కాకుండా సంస్థాగతంగా బలమైన నేత పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని సంఘ్ పట్టుబుడుతున్నది.
తర్వాతి తరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు ప్రధాని మోదీ పదవి నుంచి తప్పుకోవాలని కూడా ఆర్ఎస్ఎస్ సూచనలు అందచేసినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఒక వయసు వచ్చిన తర్వాత నాయకులు గౌరవప్రదంగా తమ పదవుల నుంచి తప్పుకుని తర్వాతి తరానికి అవకాశం ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గతవారం చేసిన సూచన పరోక్షంగా మోదీని ఉద్దేశించి ఉండవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రధాని పదవి నుంచి మోదీ తప్పుకుని తర్వాతి తరానికి అవకాశం ఇవ్వాలని ఆయన ఒత్తిడి తీసుకువస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో 75 ఏళ్లకు క్రియాశీల పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధన అనధికారికంగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17కి మోదీ ఆ వయసు చేరుకుంటారు. అయితే బీజేపీ నేతలు మాత్రం అటువంటి నిబంధన ఏదీ పార్టీలో లేదని, మోదీకి అది వర్తించబోదని వాదిస్తున్నారు.
2029 తర్వాతి భవిష్యత్తు కోసం బీజేపీని సిద్ధం చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. అప్పటికి బ్రాండ్ మోదీ పార్టీని నడిపించకపోవచ్చునని వారు వ్యాఖ్యానించారు. ‘2029 తర్వాత పార్టీని ముందుకు తీసుకువెళ్లగల వ్యక్తి బీజేపీకి సారథ్యం వహించాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచన. అందుకే పార్టీ అధ్యక్షుడి ఎంపికలో ఈ జాప్యం. కేంద్ర ప్రభుత్వంలో, కొన్ని బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా కొన్ని మార్పులు చేయాలని ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తున్నది. ఇవన్నీ జరగాలంటే కొంత సమయం అవసరం’ అని సంఘ్ నాయకుడు నేత ఒకరు వివరించారు. మోదీ వారసుడిగా పదవిని దక్కించుకునేందుకు తమలో తామే పోటీపడుతున్న అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇరువురి పట్ల సంఘ్ సంతృప్తిగా లేదని ఆయన వెల్లడించారు. కేంద్రంలో ప్రస్తుతం నంబర్ 2 పొజిషన్లో ఉన్న అమిత్ షా బీజేపీకి డీఫ్యాక్టో అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. సంస్థాగత వ్యవహారాల్లోనే కాకుండా బీజేపీ పాలిత రాష్ర్టాలలో ముఖ్యమంత్రులు, ఇతర మంత్రుల నియామకాలలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మోదీ-షా కబంధ హస్తాల నుంచి బీజేపీని విడిపించగల అధ్యక్షుడిని సంఘ్ కోరుకుంటోందని, భవిష్యత్తులో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించగల తర్వాతి తరం నాయకులను ప్రోత్సహించాలని సంఘ్ భావిస్తోందని ఆ సీనియర్ నాయకుడు తెలిపారు.