న్యూఢిల్లీ, నవంబర్ 2: పదమూడు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పలుచోట్ల బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఆ పార్టీ కొన్ని నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పశ్చిమ బెంగాల్లో, ప్రస్తుతం అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. బెంగాల్లో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగ్గా 3 చోట్ల బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. హిమాచల్లో మండి లోక్సభ స్థానం బీజేపీ చేజారింది. అదే రాష్ట్రంలో ఓ అసెంబ్లీ స్థానంలో బీజేపికి 2,644 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏపీలో కూడా ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. రాజస్థాన్లో రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడమే కాక మూడు, నాలుగు స్థానాలకు పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రాజీనామా చేసిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) నేత అభయ్ సింగ్ చౌతాలాను హర్యానాలోని ఎలనాబాద్ ప్రజలు మళ్లీ గెలిపించారు.
ఈ నెల 30న 3 లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగ్గా మంగళవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. లోక్సభ స్థానాలు- మండి(హిమాచల్)లో కాంగ్రెస్, దాద్రా నగర్ హవేలీలో శివసేన, ఖండ్వా (మధ్యప్రదేశ్)లో విజయం సాధించాయి. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే.. బీజేపీ- 7, దాని మిత్రపక్షాలైన జేడీయూ- 2 (బీహార్), యునైటడ్ పీపుల్స్ పార్టీ లిబరల్- 2 (అస్సాం), ఎంఎన్ఎఫ్- 1 (మిజోరం), ఎన్పీపీ- 2 (మేఘాలయ) స్థానాల్లో గెలుపొందాయి. ఎన్పీపీ మిత్రపక్షం యూడీపీ ఒక స్థానంలో గెలిచింది. కాంగ్రెస్- 8, తృణమూల్- 4, వైసీపీ- 1, ఐఎన్ఎల్డీ- 1 స్థానంలో విజయం సాధించాయి. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకోగా, అస్సాం, మధ్యప్రదేశ్, మేఘాలయలో మాత్రం నష్టపోయింది. అస్సాంలో బీజేపీ 3, దాని మిత్రపక్షం యూపీపీఎల్ 2 స్థానాలను గెలుచుకున్నాయి.
హిమాచల్లో కమలనాథులు చతికిల
హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలోని మండి లోక్సభ స్థానంతో పాటు 3 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. మండి నియోజకవర్గం సీఎం జైరామ్ ఠాకూర్ సొంత జిల్లా పరిధిలోనిది. ఇప్పటి వరకు బీజేపీ ఖాతాలో ఉన్న ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది. జుబ్బల్-కోట్ఖాయీ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి కేవలం 2,644 ఓట్లు వచ్చాయి. ఫతేపూర్, అక్రి అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్ నిలబెట్టుకుంది. నాలుగు స్థానాల్లోనూ బీజేపీ పరాజయం.. సీఎం ఠాకూర్ నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది.
కర్ణాటకలోనూ ఎదురుగాలి
కర్ణాటకలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురుగాలి వీచింది. సీఎం బసవరాజ్ బొమ్మై సొంత నియోజకవర్గానికి పొరుగున ఉన్న హంగల్ స్థానంలో కమలం పార్టీ ఓటమి పాలైంది. ఈ స్థానంలో బొమ్మై విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినా, 10 మంది మంత్రులు ఇక్కడే మకాం వేసినా ప్రయోజనం లేకపోయింది. జూలైలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బొమ్మై ఎదుర్కొన్న తొలి ఎన్నికల చాలెంజ్ ఇది. ఈ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉప ఎన్నిక జరిగిన మరో స్థానం సింగ్డిని బీజేపీ గెలుచుకుంది.
బద్వేల్లో వైసీపీ విజయం
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ 90,533 ఓట్ల మోజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థికి 1,12,072, బీజేపీకి 21,661, కాంగ్రెస్కు 6,217, నోటాకు 3,636 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి.
బెంగాల్లో బీజేపీ చిత్తు
ఏప్రిల్-మే నెలల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశలు గల్లంతైన బీజేపీకి… ఆ రాష్ట్రంలో మళ్లీ పరాభవం తప్పలేదు. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ బీజేపీని మట్టికరిపిస్తూ తృణమూల్ జైత్రయాత్ర కొనసాగించింది. తృణమూల్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించగా బీజేపీకి మూడు స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ స్థానాల్లో పోలైన ఓట్లలో ఆరోవంతు కూడా రాకపోవడంతో కలమదళానికి పరాభవం తప్పలేదు. ఇంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ గెలిచిన దిన్హాటా స్థానంలో ఇప్పుడు తృణమూల్ 1,64,089 లక్షల ఓట్ల రికార్డు మెజారిటీతో విజయదుందుభి మోగించింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను హైలైట్ చేస్తూ దిన్హాటాతో పాటు శాంతిపూర్ స్థానాల్లో బీజేపీ ఉద్ధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది.
బెంగాల్ ప్రజలు ఎప్పుడూ అభివృద్ధిని, ఐక్యతను కోరుకుంటారని, విద్వేష రాజకీయాలకు గుణపాఠం చెబుతారని ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయని తృణమూల్ చీఫ్, సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు తృణమూల్ గూటికి వలసపోతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. కానీ మొన్నటి వరకు తన ఖాతాలో ఉన్న రెండు స్థానాలు కూడా ఆ పార్టీ చేజారిపోయాయి. మొత్తంగా నాలుగు స్థానాల్లో టీఎంసీకి 75.02 శాతం ఓట్లు లభించగా.. బీజేపీ 14.48 శాతం ఓట్లకు పరిమితమైంది. 294 స్థానాల అసెంబ్లీలో తృణమూల్ బలం 217కు పెరిగింది. బీజేపీ స్థానాల సంఖ్య 77 నుంచి 75కు తగ్గింది.