Bihar : బిహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. నవంబర్ 20వ తేదీన పట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతన్నందున క్యాబినెట్ కూర్పు, స్పీకర్, హోంశాఖ.. వంటి కీలక పదవులు ఏ పార్టీకి దక్కుతాయి? అనేది ఆసక్తి రేపుతోంది. స్పీకర్‌గా తమ పార్టీ వ్యక్తినే నియమించుకోవాలని భారతీయ జనతా పార్టీ(BJP) పట్టుపడుతోందట. అలానే.. హోం శాఖ కోసం కూడా జేడీ(యూ), బీజేపీల మధ్య సయోధ్య కుదరడం లేదు.
బిహార్ అసెంబ్లీకి జరిగిన 18వ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 202 సీట్లు గెలుపొంది మహాగఠ్‌బంధన్ ఆశలపై నీళ్లు చల్లింది నితీశ్ బృందం. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ అత్యధికంగా 89 సీట్లు గెలుపొందగా.. జేడీ(యూ) 85 సీట్లతో రెండో స్థానంలో ఉంది. దాంతో.. ఈ రెండు పార్టీల నాయకులు స్పీకర్, హోం శాఖ పదవి తమవాళ్లకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పంతం నెగ్గించుకునేది ఎవరు? అనేది తెలియాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం నవంబర్ 20న కొలువుదీరనున్నందున.. రేపటిలోగా ఈ రెండు పోర్ట్‌ఫోలియోలపై స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్న వేళ జేడీ(యూ) నాయకుడు సంజయ్ ఝా, లలన్ సింగ్‌లు హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలనిని ఆయన నివాసంలో కలిశారు. అంతర్గతంగా జరిగిన ఈ సమావేశంలో షా, జేడీ(యూ) నాయకులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. బుధవారం జరుగబోయే ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హాజరుకానున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమి ప్రభంజనం సృష్టించింది. అధికారంలోకి రావాలనుకున్న మహాఘట్బంధన్ (Mahagathbandhan) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు విడతల్లో 243 స్థానాలకు జరిగిన ఎలక్షన్లో నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని ఎన్డేఏ 202 స్థానాల్లో గెలుపొందింది.. మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాఘట్బంధన్ బలపరిచిన సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) విజయం సాధించారు. కానీ, ఆయనకు అధికారం మరోసారి కలగానే మిగిలింది. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయనేతగా రాణించాలనుకున్న ప్రశాంత్ కిశోర్‌ను ఓటర్లు తిరస్కరించారు. ఇక చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.