హైదరాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): కేజీబీవీలకు బంకర్ బెడ్స్ సరాఫరా టెండర్లలో జరిగిన రూ. 100 కోట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని సోమవారం లోకాయుక్తకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. బంకర్బెడ్స్ స్కామ్‌పై సమగ్ర విచారణ చేపట్టాలని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేసినా ప్రభుత్వంలో చలనంలేదని విమర్శించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా పట్టింపులేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నిశాఖల్లో విచ్చలవిడి అవినీతి పర్వానికి తెరలేపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు చదువుకొనే కేజీబీవీల్లో మౌలిక వసతుల కల్పన పేరిట అక్రమాలకు పాల్పడటం శోచనీయమని వాపోయారు. నిబంధనలు ఉల్లంఘించి ట్రూఫా, ముపత్లాన్ కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రూ. 12 వేలు ఖర్చు చేసిన బంకర్బెడ్కు కాంగ్రెస్ సర్కార్ రూ. 33 వేలకుపైగా అంచనాతో కట్టబెట్టి భారీ అవినీతికి పాల్పడ్డదని విమర్శించారు. మొత్తం 45,360 బెడ్లకు ఏకంగా రూ. 164 కోట్లు కొల్లగొట్టి ఢిల్లీలోని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌కు చేరవేస్తున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.