Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వం రూ.100 కోట్ల స్కాంకు పాల్పడిందని ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో వరద బాధితులకు అందించాల్సిన సాయంలో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం రూ.100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ లో స్కాంకు సంబంధించి పలు వివరాల్ని బీజేపీ వెల్లడించింది.
కోల్ కతా హైకోర్టుకు కాగ్ సమర్పించిన 700 పేజీల నివేదిక ఆధారంగా బీజేపీ ఈ ఆరోపణలు చేసింది. వరద బాధితులు ఇబ్బందులు పడుతుంటే, అధికార పార్టీ నాయకులు వారికి అందించాల్సిన సాయాన్ని దోచుకున్నారని విమర్శించింది. బీజేపీ చెబుతున్న కాగ్ నివేదిక ప్రకారం.. 6,965 మంది బాధితులు అనేకసార్లు వరద సాయం పేరిట నగదు పొందారు. కొందరి బ్యాంకు అకౌంట్లలోకి రెండు నుంచి 42 సార్లు వరద సాయం డబ్బులు క్రెడిట్ అయ్యాయి. అసలు నష్టమే జరగని కొన్ని నిర్మాణాల మరమ్మతులకు రూ.7.5 కోట్లు చెల్లించారు. ప్రభుత్వ వేతనాలు పొందుతున్న వారికి కూడా సాయం అందింది. వరద సాయం కోసం దరఖాస్తే చేయని మరికొందరికి కూడా డబ్బులు చెల్లించినట్లు ఆధారాలున్నాయి.
The 700-page CAG report submitted to the Calcutta High Court has blown the lid off what could be a massive ₹100-crore scam in Malda’s flood relief funds under the TMC regime. These findings suggest a ruthless, systematic loot of public money-a state-sponsored heist where genuine… pic.twitter.com/tGONrxy93D
— BJP West Bengal (@BJP4Bengal) January 2, 2026
టీఎంసీతో సంబంధం ఉన్న పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు దీని ద్వారా లబ్ధి పొందారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో దీనికి సంబంధించి పత్రాలు మాయం చేస్తున్నారని బీజేపీ అంటోంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని లూటీ చేస్తోందని బీజేపీ విమర్శించింది. టీఎంసీ దీనికి సమాధానం చెప్పాలని, ఈ ఏడాది మమతను బెంగాల్ ప్రజలు ఇంటికి పంపిస్తారని కూడా బీజేపీ విమర్శించింది.