(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): బంగారం, వెండి, రాగి, లిథియం, బెరీలియం వంటి విలువైన ఖనిజాలను వెలికితీసే అనుమతులు ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థలకే ఉండేవి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు కొత్తగా నిబంధనలను సవరించింది. ఈ మేరకు గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, 2023ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.
ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే, భూగర్భంలోని ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్ హక్కులు ప్రైవేటు రంగ సంస్థలకు కూడా దక్కుతాయి. జమ్ము కశ్మీర్లో ఇటీవల బయటపడిన రూ.35 లక్షల కోట్ల విలువైన లిథియం నిల్వలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కేంద్ర సర్కారు చట్టంలో సవరణలు చేసినట్టు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.