SIR Row | బిహార్ ఓటర్ల జాబితా ఇంటెన్సివ్ రివిజన్ కేసులో సుప్రీంకోర్టు ఆధార్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు అని స్పష్టం చేసింది. అయితే, అది పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. బీహార్ ఓటర్ల జాబితా ఇంటెన్సివ్ రివిజన్ కేసుపై విచారణ సందర్భంగా సోమవారం.. ఓటర్లు తమ పేరును ఓటరు జాబితాలో చేర్చేందుకు ఆధార్ కార్డును 12వ పత్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 11 పత్రాల జాబితాను విడుదల చేసింది. గతంలో జారీ చేసిన పత్రాల జాబితాలో ఆధార్ కార్డును మాత్రం చేర్చలేదు.
తాజాగా సుప్రీంకోర్టు ఆధార్ కార్డును 12వ పత్రంగా అంగీకరించాలని ఆదేశించింది. ఆధార్ కార్డును ఆమోదించేందుకు వీలుగా అధికారులకు సూచనలు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి సూచించింది. అయితే, ఆధార్ కార్డును పౌరసత్వ రుజువుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సుప్రీం భారీ ఉపశమనం ఇచ్చింది. ఆధార్ కార్డు చెల్లుబాటును తనిఖీ చేసేందుకు ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉంటుందని తెలిపింది. ఆధార్ కార్డు చూపించి ఓటర్ల జాబితాలో చేర్చాలని ఆర్జేడీ పార్టీతో పాటు పలువురు డిమాండ్ చేశారు. ఆయా పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. బూత్ లెవల్ అధికారులు ఆధార్ కార్డులను అంగీకరించడం లేదని ఆర్జేడీ తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ అధికారులకు సూచనలు జారీ చేయలేదని సిబల్ తెలిపారు. ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది హాజరయ్యారు. ఆధార్ కార్డును పౌరసత్వ రుజువుగా అంగీకరించలేమంటూ వాదనలు వినిపించారు. పాస్పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం తప్ప.. ఎన్నికల కమిషన్ జాబితా చేసిన 11 పత్రాలను కూడా పౌరసత్వ రుజువుగా పరిగణించబోమని జస్టిస్ బాగ్చి స్పష్టం చేశారు.