న్యూఢిల్లీ: బీహార్లో అసెంబ్లీ గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లను (Bihar Assembly Elections) కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఛాత్ పూజా సంబురాలు ముగిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలనే యోచనలో ఉన్న ఈసీ.. నవంబర్ 5 నుంచి 15 వరకు మూడు దశల్లో నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలోలానే ఈ సారి కూడా మూడు దశల్లో ఎలక్షన్లను నిర్వహించనున్నట్లు ఇండియా టుడే వర్గాలు వెల్లడించాయి. వచ్చే వారం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బీహార్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది.
బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22వ తేదీన ముగుస్తుంది. అప్పటిలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సంస్కరణలు వివాదాస్పదయ్యాయి. సుమారు 65 లక్ష మందికిపైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. సెప్టెంబర్ 30న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుంది. అయితే ఈసీ చర్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తుది జాబితా చట్టవ్యతిరేకంగా ఉన్నట్లయితే మొత్తం ఓటరు లిస్టును రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
కాగా, 2020లో కూడా బీహార్ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. మొత్తం 243 స్థానాల్లో అక్టోబర్ 28న 71 చోట్ల, నవంబర్ 3న 94 సీట్లలో, నవంబర్ 7న 78 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. ఫలితాలను నవంబర్ 10న వెల్లడించారు. బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగా, ఆర్జేడీ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రతిపక్షానికే పరిమితమైంది.