Umar Khalid : ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న కీలక నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం వారు దరఖాస్తు చేసుకున్న పిటిషన్లను కర్కార్డూమా కోర్టు తిరస్కరించింది. నిందితులు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత బెయిల్ తిరస్కరణకు గురికావడం ఇది రెండోసారి. ఇంతకుముందు గత జనవరి 5న ఇద్దరి బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశంలో ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ సందర్భంగా నిందితులపై యుఏపీఏ చట్టం కింద కేసు ఉన్నప్పటికీ బెయిల్ పొందే అవకాశం ఉందని చెప్పింది.
దీంతో నిందితులు ఈస్ట్ ఢిల్లీలోని కర్కర్డూమా ట్రయల్ కోర్టును మరోసారి బెయిల్ కోసం ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చి ఆరు నెలలు గడిచినా కూడా తమ కేసు విచారణ ముందుకు సాగడం లేదని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ ఆలస్యమవుతోందని, ఇప్పటికే ఈ కేసులో తాము ఆరేళ్లుగా జైలులో ఉంటున్నామని ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లు కోర్టుకు తెలిపారు. విచారణ ముందుకు సాగకుండా తమను దీర్ఘకాలంపాటు జైలులో నిర్బంధించం అంటే తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లే అని, అందువల్ల తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై శనివారం అడిషనల్ సెషన్స్ జడ్జి సమీర్ బాజ్‌పాయ్ విచారణ జరిపారు. బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు. ఇవి విచారించదగినవి కావన్నారు. 2020, ఫిబ్రవరిలో ఢిల్లీలో అల్లర్లు జరిగాయి.
కేంద్రం తీసుకొచ్చిన చట్టాలైన సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో 53 మంది మరణించగా, 700 మంది గాయపడ్డారు. దీంతో ఈ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఇద్దరూ జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేతలు. ఢిల్లీ అల్లర్లకు వీరు కుట్ర పన్నారని ఆరోపిస్తూ యూఏపీఏ చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఆరేళ్లుగా జైలులోనే ఉంటున్నారు.