Bengaluru : దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటి, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు భారీ కరెంటు కోతలకు సిద్ధమవుతోంది. వచ్చే శనివారం, ఆదివారం నాడు నగరంలో కనీసం 12 గంటలపాటు కరెంటు నిలిచిపోనుంది. ఉదయం నుంచి సాయత్రం వరకు ఈ కోతలు ఉంటాయి. ఈ మేరకు అధికారులు ఇప్పటికే దీనిపై ప్రకటన చేశారు. బెంగళూరులో శనివారం, ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తారు. రెండు రోజులపాటు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో విద్యుత్ కోతలుంటాయి.
నగరంలో విద్యుత్ సంబంధించిన మరమ్మతులు, నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లను ఆధునీకరిస్తారు. హై కెపాసిటీ కండక్టర్లను ఏర్పాటు చేస్తారు. ఈ పనులు చేపట్టాలంటే తగినంత వెలుగు ఉండాలని, అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్నామని అధికారులు అంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ పెరిగినా బ్రేక్ డౌన్ అవ్వదు. తరచూ కరెంటు పోవడం లాంటిది ఉండదు. ఈ పనుల నిమిత్తం రెండురోజులపాటు విద్యుత్ షట్ డౌన్ ఉంటుంది. వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పవర్ సప్లై జరగాలంటే నిర్వహణ లోపాల్ని సరిదిద్దడం, నిర్మాణాలు, మరమ్మతుల కోసం చర్యలు తీసుకోవడం అవసరం. అందుకోసమే పవర్ కట్ చేసి, పనులు చేపడుతున్నారు. పనులు పూర్తైన తర్వాతే విద్యుత్ అందిస్తామని అధికారులు అంటున్నారు.
అన్ని ప్రాంతాలకు ఒకేసారి కాకుండా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో పవర్ తిరిగి వస్తుంది. దీనిపై ప్రజలకు ఇప్పటికే ప్రకటన చేసిన అధికారులు.. విద్యుత్ కోతలకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలన్నారు. పవర్ కట్కు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి ఫుల్‌గా ఛార్జ్ చేసుకోవాలన్నారు. నీళ్లకు సంబంధించి ముందుగానే అవసరాలకు సరిపడా ట్యాంకులు నింపుకోవాలని, జనరేటర్లు, ఇన్వర్టర్లు వంటివి పని చేసేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.