బెంగళూరు : కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. బెంగళూరులోని ఒక కళాశాల విద్యార్థినిపై ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, బయాలజీ లెక్చరర్ సందీప్, వారి స్నేహితుడు అనూప్ కలిసి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. మూడబిదిరెలోని ఓ ప్రముఖ కళాశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత విద్యార్థినితో స్నేహం చేసిన ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర నోట్స్ ఇస్తానని చెప్పి ఆమెను మారతహళ్లిలోని అనూప్ నివాసానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం నరేంద్రతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని బెదిరించి బయాలజీ లెక్చరర్ సందీప్, అనూప్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరి వేధింపులు భరించలేని విద్యార్థిని తన బాధను తల్లిదండ్రులతో పంచుకుంది. దీంతో వారు మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. అనంతరం మారతహళ్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు. నిందితులు ఇతర విద్యార్థులనూ ఇలాగే లైంగిక వేధింపులకు గురిచేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.