America | నెవార్క్ ఎయిర్పోర్ట్ (Newark Airport )లో భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనను భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ అధికారులు తాజాగా స్పందించారు. ఆ విద్యార్థి అక్రమంగా అమెరికాకు వెళ్లినట్లు తెలిపారు.
‘ఆ యువకుడు తప్పు చేశాడు. హర్యాణాకు చెందిన అతడు చట్టవిరుద్ధంగా, సరైన వీసా లేకుండా ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. ప్రయాణ సమయంలో అతడి ప్రవర్తన కూడా సరిగా లేదు. దీన్ని గుర్తించిన అక్కడి అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి పరిస్థితి మెరుగుపడిన తర్వాత భారత్‌కు పంపించే ఏర్పాట్లు జరుగుతాయి. దీనికి సంబంధించి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని భారత విదేశాంగశాఖ అధికారులు పేర్కొన్నారు.
అమెరికాలో భారత విద్యార్థిపై పోలీసుల కర్కశత్వం
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి స్వదేశాలకు పంపుతున్నారు. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేలపై పడుకోబెట్టి, చేతులకు బేడీలు వేశారు. వీసా రద్దయిందని, చట్ట వ్యతిరేకంగా అమెరికాలోకి ప్రవేశించాడని పేర్కొన్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో ఈ వీడియో తీసిన కునాల్ జైన్ అనే ప్రవాస భారతీయుడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. సదరు విద్యార్థి మాటతీరు చూస్తుంటే హర్యాణాకు చెందిన వ్యక్తిగా అనిపించాడని పేర్కొన్నాడు. కలలను సాకారం చేసుకోవడానికి వచ్చానని, ఎవరికీ హాని తలపెట్టేందుకు రాలేదని.. విద్యార్థి బోరున విలపిస్తున్నా పట్టించుకోకుండా నేరస్థుడి పట్ల వ్యవహరించినట్టు ప్రవర్తించారని చెప్పాడు. ప్రత్యక్ష సాక్షిగా ఈ దారుణంపై స్పందించలేని, నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశాడు.
I witnessed a young Indian student being deported from Newark Airport last night— handcuffed, crying, treated like a criminal. He came chasing dreams, not causing harm. As an NRI, I felt helpless and heartbroken. This is a human tragedy. @IndianEmbassyUS #immigrationraids pic.twitter.com/0cINhd0xU1
— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025
వీసాల దుర్వినియోగాన్ని ఉపేక్షించం: అమెరికా ఎంబసీ
నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయ విద్యార్థికి ఎదురైన ఘటనపై భారత్‌లోని అమెరికా ఎంబసీ స్పందించింది. చట్టబద్ధంగా వచ్చే ప్రయాణికులకు మాత్రమే తమ దేశంలోకి ప్రవేశం ఉంటుందని, వాళ్లకు మాత్రమే వెల్కం చెబుతామని పేర్కొంది. దేశంలోకి అక్రమ ప్రవేశాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. అక్రమ ప్రవేశం, వీసాల దుర్వినియోగం, అమెరికా చట్టాన్ని ఉల్లంఘించడాన్ని సహించబోమని అమెరికా తెలిపింది. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌పై సంబంధిత వర్గాలతో మాట్లాడుతున్నట్టు తెలిపింది. భారత పౌరుల సంక్షేమానికి కాన్సులేట్ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నది.
Also Read..
America | ఉగ్రవాది కంటే హీనంగా! అమెరికాలో భారత విద్యార్థిపై పోలీసుల కర్కశత్వం
US Embassy | అలాంటి వారికి మా దేశంలోకి ప్రవేశించే హక్కు లేదు : యూఎస్ ఎంబసీ
Mallikarjun Kharge | కుంభమేళాలో తొక్కిసలాట జరగలేదా.. యోగి రాజీనామా చేశారా..? : బెంగళూరు ఘటనపై ఖర్గే