US Embassy | భారతీయ విద్యార్థి (Indian student) పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగిన అతడ్ని సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి హింసించారు. ఇదుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనను భారతీయులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన నేపథ్యంలో భారత్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం (US Embassy) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.
చట్టబద్ధమైన ప్రయాణికులను అమెరికా (United States) స్వాగతిస్తూనే ఉంటుందని పేర్కొంది. అయితే, చట్టవిరుద్ధమైన వారికి తమ దేశంలోకి ప్రవేశించే హక్కు లేదని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ‘మా దేశంలోకి వచ్చే చట్టబద్ధమైన ప్రయాణికులను అమెరికా స్వాగతిస్తూనే ఉంటుంది. అయితే, చట్టవిరుద్ధమైన వారికి యూఎస్‌ను సందర్శించే హక్కు లేదు. అక్రమ ప్రవేశం, వీసాల దుర్వినియోగం, యూఎస్ చట్టాలను ఉల్లంఘించడాన్ని మేము సహించము. వారిని మా దేశంలోకి అనుమతించబోము’ అని భారత్‌లోని యూఎస్ ఎంబసీ తన ట్వీట్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
The United States continues to welcome legitimate travelers to our country. However, there is no right to visit the United States. We cannot and will not tolerate illegal entry, abuse of visas, or the violation of U.S. law. pic.twitter.com/WvsUb4Mtqu
— U.S. Embassy India (@USAndIndia) June 10, 2025
కాగా, రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి స్వదేశాలకు పంపుతున్నారు. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేలపై పడుకోబెట్టి, చేతులకు బేడీలు వేశారు. వీసా రద్దయిందని, చట్ట వ్యతిరేకంగా అమెరికాలోకి ప్రవేశించావని చెప్తూ తిరిగి వెనక్కి పంపించారు.
ఎయిర్‌పోర్ట్‌లో ఈ వీడియో తీసిన కునాల్ జైన్ అనే ప్రవాస భారతీయుడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. సదరు విద్యార్థి మాటతీరు చూస్తుంటే హర్యానాకు చెందిన వ్యక్తిగా అనిపించాడని పేర్కొన్నాడు. కలలను సాకారం చేసుకోవడానికి వచ్చానని, ఎవరికీ హాని తలపెట్టేందుకు రాలేదని.. విద్యార్థి బోరున విలపిస్తున్నా పట్టించుకోకుండా నేరస్థుడి పట్ల వ్యవహరించినట్టు ప్రవర్తించారని చెప్పాడు. ప్రత్యక్ష సాక్షిగా ఈ దారుణంపై స్పందించలేని, నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశాడు.
Also Read..
కిందపడేసి.. బేడీలు వేసి.. భారత విద్యార్థిపై అమెరికా పోలీసుల అమానుషం!
ChatGPT | చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. సోషల్ మీడియా ద్వారా యూజర్లు ఫిర్యాదు