Donald Trump | ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)పై గత కొంతకాలంగా డ్రగ్స్ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. మస్క్ తరచూ నిషేధిత డ్రగ్స్ (drugs) తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది. ఇక వైట్ హౌస్ (White House)లో ఉన్నప్పుడు మస్క్ తరచూ డ్రగ్స్ తీసుకున్నారంటూ ఇటీవలే అమెరికా మీడియా ఆరోపించింది.
ట్రంప్ ప్రభుత్వంలో డోజ్ శాఖకు నాయకత్వం వహించిన మస్క్.. ఆ సమయంలో డ్రగ్స్ తీసుకున్నట్లు యూఎస్ మీడియా ఇటీవలే ఆరోపించింది. ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. టెక్ బిలియనీర్ వైట్ హౌస్‌లో మత్తు పదార్థాలను వాడారో లేదో తనకు ఖచ్చితంగా తెలియదని పేర్కొన్నారు. ‘నాకు నిజంగా తెలియదు. మస్క్ మత్తు పదార్థాలు తీసుకున్నాడని నేను అనుకోవట్లేదు. అతను అలా చేసి ఉండడనే అనుకుంటున్నా’ అంటూ సమాధానమిచ్చారు. అంతేకాదు, మస్క్‌తో తనకు మంచి అనుబంధం ఉందని అధ్యక్షుడు నొక్కి చొప్పారు.
వీడ్కోలు వేళ ముఖంపై గాయంతో మస్క్..
డోజ్ శాఖ నుంచి వైదొలగిన మస్క్‌కు అధ్యక్షుడు ఇటీవలే ఘనంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఓవెల్ ఆఫీస్‌లో జరిగిన వీడ్కోలు సమావేశానికి మస్క్ ముఖంపై గాయంతో వచ్చారు. అంతేకాదు ఆయన ప్రవర్తన కూడా చాలా విచిత్రంగా అనిపించింది. అదే సమయంలో మస్క్ డ్రగ్స్ తీసుకున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఆయన క్రమం తప్పకుండా కెటామైన్, ఎక్స్టసీ, సైకెడెలిక్ తీసుకునేవారని పేర్కొంది. దీంతో వీడ్కోలు వేళ డ్రగ్స్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ విషయంపై వీడ్కోలు సమావేశంలో మస్క్‌కు ప్రశ్న ఎదురైంది. వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ వినియోగించారా? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. అదంతా తప్పుడు కథనం అంటూ చెప్పుకొచ్చారు.
Also Read..
Russia Attack: రకరకాల డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడి
Austria School: ఆస్ట్రియా స్కూల్లో కాల్పులు.. 8 మంది మృతి
Earthquakes | భారత్-మయన్మార్ సరిహద్దుల్లో వరుస భూకంపాలు.. 36 గంటల్లో ఏకంగా..