న్యూఢిల్లీ: అమెరికాలో భారత విద్యార్థికి ఘోర అవమానం జరిగింది. భారత విద్యార్థి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేలపై పడుకోబెట్టి, చేతులకు బేడీలు వేశారు. వీసా రద్దయిందని, చట్ట వ్యతిరేకంగా అమెరికాలోకి ప్రవేశించావని చెప్తూ తిరిగి వెనక్కి పంపించారు. ఎయిర్పోర్ట్లో ఈ వీడియో తీసిన కునాల్ జైన్ అనే ప్రవాస భారతీయుడు సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. సదరు విద్యార్థి మాటతీరు చూస్తుంటే హర్యానాకు చెందిన వ్యక్తిగా అనిపించాడని పేర్కొన్నాడు.
కలలను సాకారం చేసుకోవడానికి వచ్చానని, ఎవరికీ హాని తలపెట్టేందుకు రాలేదని.. విద్యార్థి బోరున విలపిస్తున్నా పట్టించుకోకుండా నేరస్థుడి పట్ల వ్యవహరించినట్టు ప్రవర్తించారని చెప్పాడు. ప్రత్యక్ష సాక్షిగా ఈ దారుణంపై స్పందించలేని, నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ ఘటనపై విదేశాంగశాఖ స్పందించాలని డిమాండ్ చేశాడు.