America | న్యూఢిల్లీ, జూన్ 10: అమెరికాలో భారతీయులకు పదేపదే అవమానాలు ఎదురవుతున్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారులో మాత్రం చలనం రావటం లేదు. ట్రంప్ రెండో పర్యాయం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించివేసే సమయంలో భారత పౌరులకు సంకెళ్లు వేయడంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. తాజాగా ఓ భారత విద్యార్థిపై అమెరికా పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. వీసా రద్దయిందని, చట్ట వ్యతిరేకంగా అమెరికాలోకి ప్రవేశించావని చెప్తూ ఎయిర్‌పోర్టులో భారత విద్యార్థిని నేలపై పడేసి, చేతులు వెనక్కి విరిచి బేడీలు వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
భారత కాన్సులేట్ ఏం చేస్తున్నది?
ఉగ్రవాదులను కూడా ఇంత హీనంగా అమెరికాలో అరెస్టు చేయటం చూడలేదని ఘటనలో ప్రత్యక్ష సాక్షి, ప్రవాస భారతీయుడు కునాల్ జైన్ వాపోయారు. అమెరికాలో అప్పుడే అడుగుపెట్టిన ఒక భారతీయ విద్యార్థి పట్ల అమెరికా వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా కలిచివేసిందని ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఉగ్రవాదులను కూడా అమెరికాలో ఈ విధంగా అరెస్టు చేయటం చూడలేదు. నేను నిస్సహాయుడిగా ఉండిపోయాను. నా మనసు ముక్కలైంది. ఇది మానవ విషాదం ’ అంటూ కునాల్ జైన్ వివరించారు. ‘అమెరికాకు ఎందుకు వచ్చాడన్నది అతడు సరిగా వివరించలేదు. దాంతో పోలీసులు అతడి పట్ల దారుణంగా వ్యవహరించారు. అతనితో హిందీలో మాట్లాడేందుకు ఎవర్నీ అనుమతించలేదు. న్యాయ సహాయం కూడా నిరాకరించటం బాధాకరం’ అని కునాల్ జైన్ చెప్పారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ 3 లేదా 4 జరుగుతున్నప్పుడు సదరు వ్యక్తులకు సాయం చేయడానికి భారత కాన్సులేట్ ఎందుకు ముందుకు రావటం లేదని ఆయన ప్రశ్నించారు.
వీసాల దుర్వినియోగాన్ని ఉపేక్షించం: అమెరికా ఎంబసీ
నెవార్క్ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయ విద్యార్థికి ఎదురైన ఘటనపై భారత్‌లోని అమెరికా ఎంబసీ స్పందించింది. చట్టబద్ధంగా వచ్చే ప్రయాణికులకు మాత్రమే తమ దేశంలోకి ప్రవేశం ఉంటుందని, వాళ్లకు మాత్రమే వెల్కం చెబుతామని పేర్కొంది. దేశంలోకి అక్రమ ప్రవేశాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. అక్రమ ప్రవేశం, వీసాల దుర్వినియోగం, అమెరికా చట్టాన్ని ఉల్లంఘించడాన్ని సహించబోమని అమెరికా తెలిపింది. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌పై సంబంధిత వర్గాలతో మాట్లాడుతున్నట్టు తెలిపింది. భారత పౌరుల సంక్షేమానికి కాన్సులేట్ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నది.
మోదీ మౌనమేల?: కాంగ్రెస్
అమెరికాలో భారతీయులకు జరుగుతున్న అవమానాలపై విపక్ష కాంగ్రెస్ మండిపడింది. తాజా ఘటనపై ప్రధాని మోదీ వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అమెరికాలో భారతీయులకు పదే పదే అవమానాలు జరుగుతున్నా ప్రధాని మోదీ మౌన ముద్ర వహిస్తున్నారని, భారతీయుల ఆత్మగౌరవం కాపాడటంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ విమర్శించారు. మంగళవారం ఆయన ‘ఎక్స్’లో స్పందిస్తూ, ‘భారత్-పాక్ కాల్పుల విరమణ ప్రకటన అమెరికా అధ్యక్షుడు ప్రకటించటం దేశ చరిత్రలోనే మొదటిసారి. భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చి కాల్పుల విరమణ ప్రకటించేలా చేశానని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించారు. దీనిపై ప్రధాని మోదీ మాట్లాడటం లేదు. అలాగే అమెరికాలో భారతీయులపై దురాగతాలు జరుగుతున్నా.. ట్రంప్‌తో మాట్లాడే ధైర్యం చేయటం లేదు’ అని విమర్శించారు.