Mallikarjun Kharge | ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట (Bengaluru stampede) ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గత బుధవారం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందంటూ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జి పరమేశ్వర రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తాజాగా స్పందించారు. ఇది కేవలం ప్రమాదమేనని (Bengaluru stampede an accident), ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని చెప్పారు. ‘కుంభమేళా సమయంలో జరిగిన తొక్కిసలాటకు ఎవరైనా రాజీనామా చేశారా..? అక్కడ లక్షలాది మంది పుణ్య స్నానాలు చేశారు. మృతదేహాలు తేలడం చూశాం. అంతేకాదు, కొవిడ్ సమయంలో కూడా చాలా మంది మరణించారు. వీటికి బాధ్యత వహిస్తూ యోగి (యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశిస్తూ) రాజీనామా చేశారా..?’ అని ఖర్గే ప్రశ్నించారు. ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని, ఈ ఘటనపై తమ నాయకులు ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పారని ఖర్గే చెప్పుకొచ్చారు.
కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇటీవలే ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇంతకంటే దారుణమైనవి చోటుచేసుకున్నాయి. కుంభమేళాలోనూ తొక్కిసలాట జరిగింది. 50-60 మంది చనిపోయారు. నేను ఘటనను సమర్థించడం లేదు. జరిగిందంతే’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
కాగా, పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్‌ని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం గత బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది.
Also Read..
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
Sonam Raghuvanshi | రాజా రఘువంశీతో ఇష్టంలేని పెళ్లి.. తల్లిని ముందే హెచ్చరించిన సోనమ్
PM Modi | దేశంలో కరోనా కలకలం.. ప్రధానితో మీటింగ్‌కు ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరి..!