ATMs | న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశంలో నగదు చలామణి రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం నెట్వర్క్లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు నానాటికీ పెరగుతుండటమే ఇందుకు కారణం. నిరుడు సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా 2.19 లక్షల ఏటీఎంలు ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్య 2.15 లక్షలకు తగ్గినట్టు రిజర్వు బ్యాంకు వెల్లడించింది.
డిజిటల్ చెల్లింపులకు ఆదరణ పెరుగుతుండటంతో బ్యాంకులు సంప్రదాయ ఏటీఎంలపై ఫోకస్ తగ్గించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లాంటి డిజిటల్ మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారిస్తున్నాయి. భౌతిక, డిజిటల్ మౌలిక వసతులను ఏకీకృతం చేయడం ద్వారా బ్యాంకులు తమ నెట్వర్క్ను తగ్గిస్తున్నాయని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ధోరణి అధికంగా ఉన్నదని ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ సంస్థ చైర్మన్ రవి బీ గోయల్ తెలిపారు.
ఇప్పటికే దేశంలో చాలా ఏటీఎంలు మూతపడటంతో ప్రస్తుతం ప్రతి లక్ష మంది ప్రజలకు 15 చొప్పున ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో నగదు వినియోగానికి, ఏటీఎంల లభ్యతకు మధ్య తీవ్ర అసమతుల్యత కొనసాగుతున్నది.