బెంగళూరు, ఫిబ్రవరి15: కంచె చేను మేసినట్టు.. వినియోగదారులు లాకర్లలో దాచుకున్న బంగారాన్ని బ్యాంక్ మేనేజర్ కాజేశాడు. దాదాపు 2.7 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించగా, వాటి ద్వారా పొందిన సొమ్ముతో ఆన్లైన్ బెట్టింగ్, జూదం ఆడాడు. బ్యాంక్ కస్టమర్లు తమ బంగారాన్ని విడిపించుకునేందుకు రాగా, ఫిబ్రవరి 2న బంగారు ఆభరణాల దొంగతనం బయటపడింది.
దీంతో బెంగళూరులోని ఓ జాతీయ బ్యాంక్‌కు చెందిన అసిస్టెంట్ మేనేజర్ కిరణ్ కుమార్(34)ను అరెస్టు చేశారు. బ్యాంక్ కస్టమర్లకు చెందిన 2,783 గ్రాముల బంగారం దొంగతనానికి గురైందని దర్యాప్తులో తేలింది. నిందితుడు లాకర్ కీలను దుర్వినియోగం చేశాడని, బ్రాంచ్ మేనేజర్ లేని సమయాల్లో.. కొంతకాలంగా తాకట్టు పెట్టిన బంగారాన్ని క్రమంగా దొంగలిస్తున్నాడని తెలిసింది.