Air India Plane | ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో విమానాన్ని అయోధ్య విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 139 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్ నేపథ్యంలో విమానాశ్రయంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం జైపూర్ నుంచి బయలుదేరగా.. అధికారుల ఆదేశాల మేరకు పైలట్లు విమానాన్ని అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత అధికారులు విమానంలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సీనియర్ ఎస్పీ రాజ్‌కరణ్ నయ్యర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పరిస్థితిపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. స్పందించేందుకు నిరాకరించారు. మరో వైపు ఏటీఎస్ సైతం విమానాశ్రయానికి చేరుకున్నది. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు వచ్చానని, ప్రస్తుతానికి అలాంటి అవసరం లేదని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఎస్ఎస్పీ, ఎస్పీ సిటీ సహా భద్రతా విభాగం అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. ముంబయి నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన విమానానికి సైతం సోషల్ మీడియా వేదికగా బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని ఢిల్లీలో అత్యవసరంగా దింపారు. అంతకు ముందు సైతం ఇండోర్‌లోని దేవి అహల్యబాయ్ హోల్కర్ విమానాశ్రయానికి సైతం బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.