రాయ్‌పూర్, ఐజ్వాల్, నవంబర్ 7: ఎదురుకాల్పులు, మందుపాతర పేలుడు వంటి హింసాత్మక ఘటనల మధ్య ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ఉద్రిక్తతంగా ముగిశాయి. మరోవైపు మిజోరంలోని 40 స్థానాలకు ఒకే విడతలో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌లో 71 శాతం, మిజోరంలో 77 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలను అడ్డుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. నక్సల్స్-భద్రతా బలగాల మధ్య ఆరు చోట్ల దాడి ఘటనలు చోటు చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సుక్మా జిల్లా తొండమర్కా ప్రాంతంలో ఉదయం మావోయిస్టులు జరిపిన ఎల్ఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్‌కు చెందిన ఒక జవాన్ గాయపడ్డారు. నారాయణపూర్, బీజాపూర్, కన్కేర్ జిల్లాల్లో ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో భద్రతా దళాలకు చెందిన వారెవ్వరూ గాయపడలేదు.
మిజోరంలోని ఐజ్వాల్‌లో సీఎం జోరంతంగా ఓటు వేస్తుండగా ఈవీఎం మొరాయించడంతో ఓటు వేయలేకపోయారు. కొంతసేపటికి తిరిగొచ్చిన ఆయన తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.