న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఆశావర్కర్లు కేంద్ర ప్రభుత్వంపై నిరసన గళమెత్తారు. మోదీ సర్కార్‌పై తిరుగుబాటకు దిగారు. కేవలం రూ.4వేల గౌరవ వేతనంతో కుటుంబ అవసరాలు ఎలా తీరుతాయని మోదీ సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం గత 60 రోజులుగా జంతర్‌మంతర్ వద్ద వేలాది మంది ఆశావర్కర్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతున్న నిరసనల్లో 26 రాష్ర్టాల నుంచి వచ్చిన 7వేల మందికిపైగా ఆశావర్కర్లు పాల్గొన్నారు. తమ వేతనాన్ని పెంచాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ తమ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరారు. కామన్‌మ్యాన్ గురించి ప్రధాని ఆలోచించాలని ఆశావర్కర్లు అన్నారు. ‘ప్రధాని మోదీజీ.. కామన్‌మ్యాన్‌కు బతుకులేకుండా పోయింది. కనీసం రొట్టెముక్క దొరకటం లేదు. స్టార్ క్యాంపెయినర్‌గా కేవలం బీజేపీ గురించి ఆలోచించటం కాదు, దేశం గురించి ఆలోచించండి’ అని అనిత అనే ఆశావర్కర్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రాష్ర్టాలకు చెందిన మహిళా ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, నరేగా(ఉపాధి హామీ), అసంఘటిత రంగాలకు చెందిన మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో నిరసనల్లో పాలుపంచుకున్నారు.
2014 తర్వాత దేశంలో మహిళలపై హింస పెరిగిందని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఫాల్మా చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘బేటి బచావో బేటి పడావో.. వంటి డొల్ల వాగ్దానాలు, నినాదాలతో మమ్మల్ని ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు? మణిపూర్‌లో మహిళలపై దారుణాలు చోటుచేసుకున్నాయి. ఇదే జంతర్‌మంతర్ వద్ద నిరసన గళం వినిపించిన మహిళా రెజ్లర్లకు ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని ఫాల్మా చౌహాన్ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం తెలంగాణలో 28,160 మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి వీరికి కేవలం గౌరవ వేతనంగా రూ.2 వేలు అందుతున్నది. అది కూడా సమయానికి వచ్చేది కాదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్‌కు ఆశాలను ఆహ్వానించారు. వారితో కలిసి భోజనం చేశారు. వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. పదేండ్లలో వారి వేతనాల్ని ప్రభుత్వం నాలుగుసార్లు పెంచింది. ఇప్పుడు రూ.9,900 అందుకుంటున్నారు. ఇందులో కేంద్రం వాటా కేవలం రూ.1800. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.8,100. కేంద్రం ఇచ్చేదానికి నాలుగురెట్లు రాష్ట్రం భరిస్తున్నది. ప్రతి ఆశా కార్యకర్తకు కేసీఆర్ ప్రభుత్వం రూ.7,848 విలువజేసే స్మార్ట్ ఫోన్‌ను కూడా అందించింది. ప్రతినెలా బిల్లును కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది.