చండీగఢ్: పెళ్లి రిసెప్షన్ జరుగుతోందా ఇంట్లో. అయితే అదే కాలనీలో ఉండే అజయ్ అనే కుర్రాడి వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందని ఆ కుటుంబం భయపడింది. అతను ఆ పరిసరాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చాలాసార్లు అందరినీ భయాందోళనలకు గురిచేశాడు. ఈ క్రమంలోనే ఫంక్షన్ కోసం తమ ఇంటికి చిన్నపిల్లలు, చుట్టాలు వచ్చారని, కారును కొంచెం నిదానంగా నడపాలని ఆ కుటుంబం వెళ్లి అజయ్‌ను కోరింది.
ఈ మాటలు విన్న అజయ్ తండ్రికి కోపం వచ్చింది. తన కుమారుడికి నచ్చినట్లు కారు డ్రైవ్ చేస్తాడంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో కారు రివర్స్ గేర్‌లో వేగంగా దూసుకొచ్చిన అజయ్.. పెళ్లి ఇంటి ముందు నిలబడి ఉన్న ఐదుగురిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
ఈ ఘటన హరయాణాలోని కర్నాల్‌లో నిలోఖేరి ప్రాంతంలో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు అజయ్, అతని తండ్రిపై హత్యానేరం కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు తండ్రీకొడుకులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.