Industrial Smart Cities : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ, బిహార్, పంజాబ్‌లో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తారు. తెలంగాణలోని జహీరాబాద్‌లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తారు. ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు కొలువుతీరనున్నాయి.
ఓర్వకల్లులో 2621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు కానుంది. ఇక క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 28602 కోట్లను వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏకంగా రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ ప్రాజెక్టుతో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 30 లక్షల పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ కారిడార్లలో ప్లగ్ అండ్ ప్లే, వాక్ టూ వర్క్ కాన్సెప్ట్‌పై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. మరోవైపు పోలవరం నిధులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడిఉందనేందుకు ఈ నిర్ణయమే ఓ సంకేతమని ఆయన పేర్కొన్నారు. ఇక కూటమిలోకి చేరికలపై రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలోకి ఎవరు వచ్చినా పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారు.
Read More :
Terrorist | రామేశ్వరం కేఫ్ తరహాలో రైళ్లపై దాడులకు కుట్ర.. కలకలం సృష్టిస్తోన్న పాక్ ఉగ్రవాది వీడియో