Ashwini Vaishnaw : ‘మొంథా’ తుఫాను (Montha cyclone) ముంచుకొస్తు్ండటంతో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది. తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా తెలుగు రాష్ట్రాల్లో, ఒడిశాలో డివిజనల్ వార్ రూమ్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి (Railway minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) ఉన్నతాధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలైన దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకించి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం డివిజన్ల పరిధిలో అవసరమైన యంత్రాలు, సామగ్రితోపాటు సిబ్బందిని తక్షణమే అందుబాటులో ఉంచాలన్నారు. తుఫాను వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారుల నుంచి నివేదిక కోరారు.
తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తుఫాను కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించాలని పేర్కొన్నారు.