Asaduddin Owaisi | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): హర్యానాలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకోలేదని, ఆ పార్టీ అంతర్గత విభేదాలే బీజేపీ గెలుపునకు కారణమైనట్టు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను నిందించడంపై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలలో తప్పులను ఎత్తి చూపుతుందని, ఈవీఎంలను నిందించడం చాలా సులభమైందన్నారు. ఎన్నికల పోరులో ఏ మాత్రం అవకాశం వచ్చినా దాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకుంటుందని 2024 పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలిసిందని, అయితే కాంగ్రెస్ మాత్రం ఆ పార్టీని ఓడించడానికి సువర్ణావకాశం వచ్చినా, దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయిందని విమర్శించారు.