హిందుత్వ విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మాట్లాడిన మాటలకు ఎంఐఎం అధినేత ఒవైసీ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అనుసరించే సెక్యులర్ విధానం ఇదేనా? ఇదే విధానాన్ని రూఢీ చేసుకుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. రాహుల్, కాంగ్రెస్ ఈ రెండూ కలిసి ప్రస్తుతం హిందుత్వ అనే భూమిని తయారు చేస్తున్నారని, అందులో హిందుత్వ అనే పంటను సాగు చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. హిందుత్వం అన్న మతం ఆధారంగా, అలాంటి రంగు ఉన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ రెడీ అయిపోయిందన్నారు. భారత్ కేవలం హిందువులది మాత్రమే కాదని, అందరిదని ఒవైసీ మరోసారి పునరుద్ఘాటించారు.
జైపూర్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఏమన్నారంటే…
నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జైపూర్ వేదికగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తాను హిందువునని, హిందుత్వ వాదిని మాత్రం కాదని ప్రకటించారు. గాంధీ ఓ హిందువని, గాడ్సే మాత్రం హిందుత్వవాది అని అన్నారు. హిందువులు ఎప్పుడూ నిజమే చెబుతారని, హిందుత్వవాదులు అబద్ధాలు చెబుతారని వ్యాఖ్యానించారు. హిందువు ఎప్పుడూ సత్యాన్నే నమ్ముకుంటారని, అదే హిందుత్వవాదులు పదవి నుంచి దిగిపోయిన తర్వాత సత్యాన్ని మూలకు పెట్టేస్తారని రాహుల్ వ్యాఖ్యానించారు. హిందుత్వవాదులను తొలగించి, హిందూ రాజ్యాన్ని స్థాపన చేయాలని తాము అనుకుంటున్నామని రాహుల్ ప్రకటించారు.