చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) డీలిమిటేషన్ వివాదంపై మరో అడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ వివాదంపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటుకు కసరత్తు చేపట్టారు. దీని కోసం ఏడు రాష్ట్రాల సీఎంలను చెన్నైకు ఆహ్వానించారు. దక్షిణాదిలోని కర్ణాటక, కేరళ, ఆంధ్రా, తెలంగాణాతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. డీలిమిటేషన్ కసరత్తుకు ప్రణాళిక కోసం జేఏసీ ఏర్పాటుకు పిలుపునిచ్చారు.
కాగా, జేఏసీపై ఏకీకృత వ్యూహాన్ని సమన్వయం చేసేందుకు ఏడు రాష్ట్రాలకు చెందిన పార్టీల నుంచి సీనియర్ ప్రతినిధులను ఆయా రాష్ట్రాలు నామినేట్ చేయాలని సీఎం స్టాలిన్ కోరారు. అలాగే డీలిమిటేషన్‌పై సమిష్టిగా చర్చించడానికి మార్చి 22న చెన్నైలో ప్రారంభ సమావేశం ఏర్పాటుకు ప్రతిపాదించారు. ‘నాయకత్వం, సహకారాన్ని ప్రస్తుత పరిస్థితి కోరుతోంది. రాజకీయ విభేదాలకు అతీతంగా సమిష్టి మంచి కోసం మనం నిలబడాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు జనాభా నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేసి, మంచి పాలన కొనసాగించిన రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో అన్యాయంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. జనాభా ప్రతిపాదికన లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగితే తమిళనాడు ఎనిమిది సీట్లు కోల్పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.