న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు పెరుగడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల్లో బిజీగా ఉన్నారంటూ మండిపడ్డారు. గ్యాంగ్స్టర్ల నియంత్రణలో ఢిల్లీ ఉందని ఆరోపించారు. శనివారం దేశ రాజధానిలో వేర్వేరుగా రెండు హత్యలు జరుగడంపై కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలో శాంతిభద్రతల బాధ్యత అమిత్ షాపై ఉంది. కానీ ఆయన ఎన్నికలతో బిజీగా ఉన్నారు. గ్యాంగ్స్టర్ల నియంత్రణలో ఢిల్లీ ఉంది. షూటర్లను అరెస్టు చేస్తున్నప్పటికీ వెనుక ఉన్న సూత్రధారులు ఇంకా పరారీలో ఉన్నారు’ అని మీడియాతో అన్నారు.
కాగా, కేంద్ర హోంశాఖ పరిధిలో పోలీసులు ఉన్న ఢిల్లీలో శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నాయని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. నేరస్థులకు భయంలేకుండా పోయిందని అన్నారు. బెదిరింపు ఫోన్ కాల్స్ కారణంగా పలువురు వ్యాపారులు ఢిల్లీని వీడి పోతున్నారని తెలిపారు. ‘ఢిల్లీలో మహిళలకు భద్రత లేదు. అత్యాచారాలు, హత్య కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఢిల్లీ ప్రజలను రక్షించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమవుతున్నారు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.