Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన భార్య సునీత కేజ్రీవాల్ (Sunita Kejriwal)ను ఝాన్సీ రాణితో పోల్చారు. సోమవారం ఢిల్లీలోని గాంధీనగర్లో జరిగిన ఎన్నికల సభలో తొలిసారి తన భార్యతో కలిసి కేజ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ప్రశంసిస్తూ.. ‘ఝాన్సీ కి రాణి’ (Jhansi Ki Rani) అంటూ సంబోధించారు.
‘ఈరోజు నాతోపాటు నా భార్యను కూడా వెంట తీసుకొచ్చా. నేను లేని సమయంలో ఆమె అంతా తానై నడిపించారు. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను తరచూ కలిసేందుకు వచ్చేవారు. ఆమె ద్వారా ఢిల్లీ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేవాడిని. వారికి నా సందేశాలు పంపేవాడిని. ఆమె ఝాన్సీ కి రాణి వంటివారు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. త్వరలో దేశానికి మంచిరోజులు రాబోతున్నాయని.. మోదీ వెళ్లిపోతున్నారని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విపక్ష కూటమికి ఈ ఎన్నికల్లో 300 సీట్లకుపైనే వస్తాయని జోష్యం చెప్పారు.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. దాదాపు 50 రోజులపాటు జైల్లో ఉన్న ఆయనకు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూ2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బెయిల్ పీరియడ్లో ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టారు కేజ్రీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే, మళ్లీ ఆయన జైలుకు వేళ్లే అవకాశాలు ఉండటంతో తన భార్య సునీతను ప్రమోట్ (Kejriwal Promotes Wife) చేసే ఉద్దేశంలో కేజ్రీవాల్ ఉన్నారని రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తన ఎన్నికల ప్రచారంలో భార్యతో కలిసి హాజరయ్యారని.. ఆమెను ఝాన్సీ రాణితో పోలుస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read..
Flyover | ఫ్లైవోవర్పై నుంచి కిందపడ్డ బస్సు.. ఇద్దరు మృతి
Hemant Soren: హేమంత్ సోరెన్ బెయిల్ పిటీషన్.. కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు