Arvind Kejriwal : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఢిల్లీలో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులను పాకిస్థానీలతో పోల్చారు. అమిత్ షా వ్యాఖ్యలపై కేజ్రీవాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నిన్ను తన వారసుడిగా ఎంచుకున్నారని, దాంతో నీలో గర్వం పెరిగి ప్రజలను దూషిస్తున్నావని అమిత్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేశారు.
‘సోమవారం అమిత్ షా బహిరంగ సభకు 500 మంది కూడా రాలేదు. ఢిల్లీకి వస్తూనే ఆయన దేశ ప్రజలను దూషించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులను పాకిస్థానీలతో పోల్చారు. నేను ఆయనను కొన్ని ప్రశ్నలు అడగదల్చుకున్నా. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకుగాను ప్రజలు మాకు 62 స్థానాలు కట్టబెట్టారు. 56 శాతం మంది ఓటేశారు. అంటే ఢిల్లీ ప్రజలంతా పాకిస్థానీలేనా..? పంజాబ్లో 117 ఎమ్మెల్యే సీట్లకుగాను 92 సీట్లు కట్టబెట్టారు. అంటే పంజాబ్ ప్రజలు పాకిస్థానీలా..?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
‘అదేవిధంగా గుజరాత్, గోవా, ఉత్తరప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించారని, వాళ్లందరూ పాకిస్థానీలేనా..? ప్రధాని మోదీ నిన్ను తన వారసుడిగా ఎంచుకున్నారు. దాంతో నీలో బాగా గర్వం పెరిగి దేశ ప్రజలను దూసిస్తున్నావ్. బెదిరిస్తున్నావ్. నువ్వింకా ప్రధానివి కాలేదు. కానీ ఒక అరాచకవాదివి అయ్యావు. నీకు ఒక్క విషయం చెబుతున్నా.. నువ్వు ఎప్పటికీ ప్రధానివి కాలేవు. ఎందుకంటే జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల్లో బీజేపీ గెలువదు’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.