Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రేపటితో ముగియనుంది. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులు, ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సందేశాన్నిచ్చారు (Kejriwal Message For Supporters). మధ్యంతర బెయిల్ ముగియడంతో జూన్ 2న లొంగిపోనున్నట్లు తెలిపారు (Surrender). లొంగిపోయేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరనున్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందొద్దని ఈ సందర్భంగా తన మద్దతుదారులకు సూచించారు.
‘మధ్యంతర బెయిల్ ముగియడంతో లొంగిపోయేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నేను ఇంటి నుంచి బయలుదేరుతా. మేము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. దేశం కోసం నా జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తే.. ఎవరూ ఆందోళన చెందొద్దు’ అని విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు. 50 రోజుల జైలు శిక్షలో ఆరోగ్యం గణనీయంగా క్షీణించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఫలితంగా భారీగా బరువు తగ్గానని, జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా బరువు పెరగలేదని పేర్కొన్నారు. ఇన్ని సవాళ్లు ఎదురైనా ఢిల్లీ ప్రజల సంక్షేమమే తన ప్రధాన ధ్యేయమన్నారు. తమ సర్కారు అమలు చేస్తున్న అన్ని స్కీమ్‌లు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు, ఉచిత మందులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి నిత్యావసర సేవలు, కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూ 1 వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఇక జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. దీంతో బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, కేజ్రీ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్వీకరించలేదు. దీంతో ఆయన ఆదివారం నాడు లొంగిపోనున్నారు.
Also Read..
PM Modi | ద్రవపదార్థాలే ఆహారం.. 45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ డైట్
Heatwave | ఉత్తరాదిన భానుడి ప్రతాపం.. వడదెబ్బ కారణంగా 41 మంది మృతి
Air Hostess | రహస్య భాగాల్లో దాచి బంగారం స్మగ్లింగ్.. ఎయిర్‌హోస్ట్ అరెస్ట్