సిమ్లా : మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఓటు వేయాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను కోరారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలోని హమీర్పూర్ జిల్లాలోని టౌన్హాల్లో జరిగిన సమావేశంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ పాల్గొన్నారు. హిమాచల్‌లో 14 లక్షల మంది విద్యార్ధులు స్కూళ్లకు వెళుతుండగా వీరిలో 5.5 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారని, 8.5 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారని అన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో ఎక్కువ మంది విద్యార్ధులు చదువుతున్నారంటే రాష్ట్రంలో పేదరికం ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8.5 లక్షల మంది విద్యార్ధుల భవితవ్యం అంధకారమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2000 పాఠశాలల్లో కేవలం ఒక టీచర్ ఉన్నారని, 722 పాఠశాలలు కేవలం ఒక గదిలోనే నడుస్తున్నాయని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8.5 లక్షల మంది విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్ కావాలంటే తమ పార్టీకి ఓ అవకాశం ఇవ్వాలని తల్లితండ్రులను కోరారు. విద్యావ్యవస్ధలో మార్పులు చేపట్టిన ఆప్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 16 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్‌కు భరోసా ఇచ్చిందని చెప్పారు. గత ఏడేండ్లుగా తమ ప్రభుత్వం సర్కారీ స్కూల్స్‌పై రూ 80,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కేజ్రీవాల్ వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు విద్య, ఉపాధి అవకాశాల పేరుతో ఓట్లు అడిగే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.