Green Asha : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలు సహా అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే, వాటిలో భారత నౌకలు ఒక్కొక్కటిగా జలసంధి దాటుతున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది నౌకలు హార్ముజ్ దాటగా.. ఇప్పుడు తొమ్మిదో నౌక కూడా హార్ముజ్‌ను దాటినట్లు తెలుస్తోంది. గ్రీన్ ఆశ అనే ఎల్పీజీ కలిగిన నౌక ఆదివారం విజయవంతంగా ఈ జలసంధిని దాటినట్లు తెలుస్తోంది. ఇది జలసంధిని దాటిన తొమ్మిదో భారత నౌక. ఇంతకుముందు గ్రీన్ శాన్వి అనే ఎనిమిదో నౌక శుక్రవారం హార్ముజ్‌ను దాటింది. ఈ నౌకలో 46,650 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ఈ నౌక గుజరాత్‌లోని దహేజ్ చేరుకోనుంది.
గ్రీన్ ఆశ నౌక 24-36 గంటల్లో ఇండియన్ పోర్టు చేరుకోనుంది. మరోవైపు ఈ నౌకకు ఇండియన్ నేవీ రక్షణగా ఉంటోంది. ‘ఉర్జా సురక్ష’ పేరుతో ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ నేవీ.. హార్ముజ్ నుంచి వచ్చే మన నౌకలకు రక్షణ కల్పిస్తోంది. ఆ నౌకలను కమ్యూనికేట్ చేయడం, నావిగేషనల్ గైడెన్స్ ఇవ్వడం చేస్తోంది. అయితే, సైనిక నౌకలకు ఈ మార్గంలో ప్రవేశం లేదు. అయితే, ఈ మార్గంలో చమురు నౌకలు వెళ్లేందుకు అవసరమైన సూచనలు, ఆదేశాల్ని మాత్రమే జారీ చేస్తాయి. ఇక, భారత నౌకలకు రక్షణ కోసం ప్రభుత్వం దౌత్య చర్యలు చేపట్టింది. ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతూ మన నౌకలు సురక్షితంగా ఇండియా చేరేలా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో ఇరాన్ కూడా సాయం చేస్తోంది. ఇంకా పలు భారత నౌకలు హార్ముజ్ వద్ద చిక్కుకుపోయాయి. మరో నౌక కూడా ఇక్కడ్నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తో్ంది. ప్రస్తుతం దేశంలో చమురు కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వరుసగా నౌకలు ఇండియాకు వస్తుండటం ఎంతో కొంత ఊరట కలిగిస్తుంది.
ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. అప్పటినుంచి ఈ మార్గంలో వచ్చే నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని నౌకల్ని మాత్రమే ఇరాన్ అనుమతిస్తోంది. ఇక, అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన నౌకలపై మాత్రం పూర్తిగా నిషేధం విధించింది. ఆ దేశాల నౌకలను అనుమతించబోమని తెలిపింది.