Priyanka Gandhi : పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల్లో వాడీవేడి చర్చలు (Heated debates), వాకౌట్లు (Walkouts), నిరసనలు (Protests) చోటుచేసుకున్నాయి. వింటర్ సెషన్ ముగిసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ ఓంబిర్లా (Speaker Om Birla) వివిధ పార్టీల శాసనసభాపక్ష నేతలకు టీ పార్టీ (Tea party) ఇచ్చారు. ప్రతి సెషన్ ముగిసిన తర్వాత పార్టీల మధ్య వైరాన్ని తగ్గించడం కోసం స్పీకర్ టీ పార్టీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన టీ పార్టీకి విపక్ష నేతలంతా హాజరయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అందుబాటులో లేకపోవడంతో ఆయన తరఫున ప్రియాంకాగాంధీ టీ పార్టీకి వెళ్లారు. అక్కడ ఆమె రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పక్కన కూర్చున్నారు. రాజ్‌నాథ్‌కు మరో పక్క ప్రధాని మోదీ, స్పీకర్ ఓంబిర్లా ఉన్నారు. ఈ పార్టీలో అన్ని పార్టీల ఎంపీల మధ్య కొన్ని సరదా సంభాషణలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రియాంకాగాంధీ చెప్పిన ఒక మాట విని రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని మోదీ నవ్వారు.
అలర్జీలను నిర్మూలించడం కోసం ఇటీవల తాను వాయనాడ్‌లో మూలికను తిన్నానని చెప్పారు. ప్రియాంక ఆ మాట చెప్పగానే ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నవ్వుతూ కనిపించారు. అదే సమయంలో ప్రియాంకాగాంధీ.. ‘మీ మూడు దేశాల పర్యటన ఎలా జరిగింది..?’ అని ప్రధానిని ఆరా తీసింది. అందుకు ఆయన ‘చాలా బాగా జరిగింది’ అని బదులిచ్చారు.