కాసర్ఘంజ్, ఏప్రిల్ 28: బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్లను తమ పార్టీ తొలగించబోదని ఆయన పేర్కొన్నారు. ఇది మోదీ గ్యారెంటీ అని అమిత్‌షా చెప్పుకొచ్చారు. యూపీలోని కాసర్ఘంజ్లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా ఆ పార్టీ ఇతర నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ‘బలహీన వర్గాల పేరుతో రాహుల్ బాబా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే, దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.