(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ‘బీజేపీలో అన్నీ తానై నడిపిస్తున్న ప్రధాని మోదీ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు?’.. బెయిల్‌పై ఇటీవల విడుదలైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన ఈ ప్రశ్న దేశీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. అయితే, ప్రధాని మోదీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని, దీంతో మోదీ వారసుడు ఎవరన్న దానిపై బీజేపీలోనూ పెద్దఎత్తున చర్చ మొదలైందని బ్రిటిష్ వీక్లీ మ్యాగజైన్ ‘ది ఎకానమిస్ట్’ ఓ ప్రత్యేక కథనంలో పేర్కొంది. మోదీ వల్ల బీజేపీకి ఓ రకంగా నష్టమేనని పేర్కొన్న వార్తాపత్రిక.. దానికి గల కారణాలనూ వివరించింది. అలాగే, మోదీకి వారసుడిగా ఎవరు అర్హులో కూడా చర్చించింది. మ్యాగజీన్ కథనంలో పేర్కొన్న ప్రధానాంశాలు సమగ్రంగా..
కేజ్రీవాల్ ప్రశ్నతో చర్చ మొదలు..
‘మోదీ తర్వాత ఆయన వారసుడిగా ఎవరు ఉంటారు? ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడుతారు?’ అని గతవారం కేజ్రీవాల్ ప్రశ్నించారు. 75 సంవత్సరాలు నిండిన నేతలకు రిటైర్మెంట్ ప్రకటించి పంపించే సంప్రదాయం బీజేపీలో ఉన్నదని గుర్తుచేసిన కేజ్రీవాల్.. మరికొన్నాళ్లలో 75 ఏండ్లు పూర్తిచేసుకోబోతున్న ప్రధాని మోదీ ఆ సంప్రదాయాన్ని కూడా పాటిస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్‌ను వయసు ప్రాతిపదికన బలవంతంగా పక్కనపెట్టిన విధానాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
మోదీ తర్వాత ఆయన వారసుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పగ్గాలు చేపడుతారని, షాను ప్రధానిని చేయడానికే మోదీ ఓట్లు అడుగుతున్నట్టు చెప్పారు. దీనిపై షా కూడా వెంటనే స్పందించారు. 75 ఏళ్లు నిండిన తరవాత నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగకూడదని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదన్నారు. తదుపరి ఐదేండ్లు కూడా ప్రధానిగా నరేంద్ర మోదీనే కొనసాగుతారని చెప్పుకొచ్చారు. అయితే, గడిచిన నాలుగు దశల ఎన్నికల్లో ఓటింగ్ శాతం క్రమంగా తగ్గుతుండటం, ప్రచారంలో ముస్లింలను బద్నాం చేస్తూ హిందూత్వను ముందరేసుకోవడానికే మోదీ మొగ్గు చూపడం.. వెరసి మోదీ పట్ల ప్రజల్లోనూ అంతకంతకూ అసంతృప్తి, విసుగు పెరుగుతున్నది. ఈ క్రమంలో కేజ్రీవాల్ లేవనెత్తిన ‘మోదీ తర్వాత..’ ప్రశ్న ప్రాధాన్యతను సంతరించుకొన్నది. బీజేపీలోనూ ఈ చర్చ క్రమంగా పెరుగుతున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
భవిష్యత్తులో బీజేపీకి నష్టమే!
2019 ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది. మోదీని చూసే బీజేపీకి చాలామంది ఓట్లేశారు. అయితే, ఈ విషయమే భవిష్యత్తులో బీజేపీకి నష్టదాయకంగానూ మారొచ్చు. ఒకవేళ ప్రధాని మోదీ రిటైర్మెంట్ (వయసురీత్యా లేదా ఆరోగ్య కారణాల వల్ల కూడా) తీసుకొని ఇప్పటికిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటే, మిత్రపక్షాలు బీజేపీతో ఇప్పుడు ఉన్నంత సఖ్యతగా ఉంటాయా? అనేది సందేహమే.
ఓటర్ల మద్దతు బీజేపీకి ఎలా ఉంటుందన్నది కూడా ప్రశ్నే. అందుకే, మోదీ వారసుడిని నిర్ణయించడం ఆ పార్టీ అధిష్ఠానానికి ఇప్పుడు సవాలుగా మారింది. ఒకవేళ, తదుపరి ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం జరిగితే, అది బీజేపీకి అంత సులభం కాకపోవచ్చు కూడా. ఆరెస్సెస్‌తో పాటు బీజేపీకి నిధులను సమకూరుస్తున్న బిజినెస్ కమ్యూనిటీని కూడా ఆ పార్టీ పెద్దలు ఈ విషయంపై సంప్రదింపులు జరుపాల్సి ఉంటుంది.

రేసులో వీళ్లు..
మోదీ వారసుడిగా రేసులో అమిత్ షా ముందుంటారు. 1980లో నుంచే మోదీకి ఆయన నమ్మకస్తుడు. మిత్రుడు. రాజకీయ వ్యూహకర్త. అయితే అమిత్ షాకు ప్రజల్లో కరిష్మా మాత్రం అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ రేసులో ప్రధానంగా కనిపిస్తారు. దేశంలో అత్యంత జనాభా కలిగిన రాష్ర్టానికి ఆయన సీఎం. దేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన సీఎంగానూ నిలిచారు. పైగా హిందూ మఠాధిపతి.
ఆదిత్యనాథ్‌కు ఆరెస్సెస్ నుంచి మంచి సపోర్ట్ ఉన్నప్పటికీ, బీజేపీలో ఆయన్ని వ్యతిరేకించే వాళ్లు కూడా ఎక్కువే. అయితే, అమిత్ షాకు ఉన్నట్టు యోగికి ఎకనమిక్ మేనేజ్మెంట్ అంతగా లేనట్టు చెప్తారు. అయితే, దీన్ని అధిగమించేందుకు యోగి తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు కూడా. ఇక ఈ రేసులో ఉన్న మూడో వ్యక్తి రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ. ఈయనకు అటు ఆరెస్సెస్ సపోర్ట్‌తో పాటు బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా మంచి అనుభవం ఉన్నది. అయితే, మోదీపై గడ్కరీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఉద్వాసనకు గురయ్యేలా చేశాయి.
బీజేపీకి రెండూ ఇబ్బందికరమే
రానున్న ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆశాజనక ఫలితాలు సాధిస్తే, మోదీ రిటైర్మెంట్ ఉండకపోవచ్చు. బీజేపీలో ఆయనే ఏకైక శక్తిగా మరింత బలోపేతం అవొచ్చు. ఎన్నికల్లో ఒకవేళ బీజేపీకి నిరాశాజనక ఫలితాలు వస్తే, మోదీ రిటైర్మెంట్పై చర్చ ఊపందుకొంటుంది. వారసుడి పీఠం కోసం పోటీ పెరిగి పార్టీలో ముసలం పుట్టొచ్చు. ఈ రెండు పరిణామాలు ఒక విధంగా బీజేపీకి ఇబ్బందికరమే.