అహ్మదాబాద్, జూన్ 4: ప్రధాని మోదీ, అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో బీజేపీకి మరోమారు భారీ విజయం దక్కింది. క్లీన్‌స్వీప్ చేసే అవకాశం తృటిలో తప్పింది. రాష్ట్రంలోని 25 స్థానాలకు (సూరత్ మినహా) ఎన్నికలు నిర్వహించగా 24 ఎంపీ స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ గెలుపు ఒకే ఒక స్థానానికి (బనస్కాంత) పరిమితమైంది. అంతేగాక, ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపొందింది. గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ మెజార్టీతో గెలుపొందారు.
ఆయనకు 7,44,716 ఓట్ల మెజార్టీ లభించింది. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తమ్ రూపాలా ఇద్దరూ భారీ మెజార్టీతో విజయం అందుకున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అన్ని స్థానాల్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల ప్రక్రియ మొదలు కాకుండానే బీజేపీ సూరత్ స్థానాన్ని కైవసం చేసుకోవటం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించి.. ఏకగ్రీవం చేసుకున్నారన్న విమర్శలున్నాయి.