న్యూఢిల్లీ : పాకిస్థానీ జాతీయులందరినీ గుర్తించి వారిని వెంటనే వారి స్వదేశానికి పంపించివేయాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ర్టాలను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు శుక్రవారం అధికార వర్గాలు వెల్లడించాయి. జమ్ముకశ్మీరులోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాదుల పాశవిక దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై ఐదు అంచెల దౌత్యపరమైన ప్రతీకార చర్యలను చేపట్టిన భారత ప్రభుత్వం అందులో భాగంగా పాక్ జాతీయులకు చెందిన అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి వీసాలు రద్దవుతాయని విస్పష్ట ప్రకటన చేసిన భారత్ మెడికల్ వీసాలకు మాత్రం అదనంగా 48 గంటల గడువు ఇచ్చింది.
పాకిస్థానీ జాతీయులకు జారీచేసిన 14 రకాల వీసాలను భారత ప్రభుత్వం శుక్రవారం రద్దు చేసింది. వీటిలో వ్యాపారం, సమావేశాలు, పర్యాటక, యాత్రలు, వైద్యం తదితర అంశాలకు చెందినవి ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ నుంచి పాకిస్థాన్‌కు చుక్క నీటిని కూడా వెళ్లనీయమని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఉగ్రదాడి పరిణామాల నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పలు ఆదేశాలను జారీ చేశారని, వాటిని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న చారిత్రక నిర్ణయం పూర్తి సమర్థనీయమైనదని ఆయన అన్నారు. కాగా, సింధూ జలాలు పాకిస్థాన్‌లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలను భారత్ మొదలు పెట్టినట్టు సమాచారం.