చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ‘తమిళగ వెట్రి కజగం’ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ చీఫ్ విజయ్ ప్రకటించిన ఎన్నికల ‘మేనిఫెస్టో’ విజయానికి కీలకంగా మారింది. (Vijay’s manifesto) ప్రధానంగా మహిళలు, రైతులు, యువత లక్ష్యంగా అనేక హామీలు ఇచ్చారు. 60 ఏళ్లలోపు ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ఏడాదికి ఆరు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.
కాగా, మహిళల భద్రతకు ప్రత్యేక ప్రభుత్వ శాఖ, ప్రత్యేక మహిళా కోర్టులు వంటివి టీవీకే వాగ్దానం చేసింది. ప్రతి వధువుకు ఒక సావరిన్ బంగారు నాణెం, ఒక పట్టు చీర, తల్లులకు, పుట్టిన శిశువుకు బంగారు ఉంగరం ఇస్తామని హామీ ఇచ్చింది. పాఠశాల మానేసే బాలికల సంఖ్యను తగ్గించడానికి, వారి తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి రూ.15,000 అందజేస్తామని తెలిపింది. మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొంది.
మరోవైపు యువత కోసం ‘మేనిఫెస్టో’లో కీలక హామీలను విజయ్ పార్టీ ప్రకటించింది. 12వ తరగతి నుంచి పీహెచ్డీ స్థాయి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ నియామకాలన్నింటికీ ఒక ‘పారదర్శక’ కాలపరిమితిని వాగ్దానం చేసింది. పట్టభద్రులకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.2,500 నిరుద్యోగ భృతిని కూడా అందిస్తామని పేర్కొంది.
అలాగే నిరుద్యోగులకు, కార్మికులకు నైపుణ్య శిక్షణతో పాటు ఆదాయ వనరులు సమకూరుస్తామని టీవీకే హామీ ఇచ్చింది. నైపుణ్య శిక్షణ పొందుతున్న నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.10,000, ఐటీఐ డిప్లొమా హోల్డర్లకు రూ.8,000 అందిస్తామని తెలిపింది. ‘సీఎం పీపుల్ సర్వీస్ అసోసియేట్’ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసింది. ఈ ఉద్యోగం ద్వారా వారు నెలకు రూ.18,000 సంపాదిస్తారని పేర్కొంది. సిబ్బందిలో 75 శాతం స్థానికులను నియమించుకునే కంపెనీలకు 2.5 శాతం జీఎస్టీ సబ్సిడీ, విద్యుత్ ఛార్జీలపై 5 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొంది.
మరోవైపు విజయ్ తన మేనిఫెస్టోలో రైతులకు గణనీయమైన హామీలు ఇచ్చారు. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్నవారికి సహకార వ్యవసాయ రుణమాఫీ, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి 50 శాతం రుణ మాఫీ చేస్తామని పేర్కొన్నారు. అలాగే వరికి క్వింటాల్‌కు రూ.3,500, చెరకుకు రూ.4,500 చొప్పున చట్టబద్ధంగా మద్దతు ధరను ప్రకటించారు. కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు రూ.10,000 అందించడంతో పాటు సాగుదారుల హక్కుల కార్డును ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.
కాగా, ప్రభుత్వ పథకాలన్నీ పొందేందుకు వీలుగా ప్రతి కుటుంబానికి ఒక పౌర ప్రత్యేకాధికార కార్డు అందిస్తామని టీఎంకే పేర్కొంది. అలాగే అన్ని ప్రభుత్వ సేవలను సకాలంలో అందించడాన్ని చట్టబద్ధం, తప్పనిసరి చేసే ‘సేవా హక్కు చట్టం’ను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. పౌరులు నేరుగా రాష్ట్ర శాసనసభకు వినతిపత్రాలను సమర్పించవచ్చని పేర్కొంది. వాటిలో 5 లక్షల స్పందనలను చర్చకు స్వీకరిస్తామని, 10 వేల సంతకాలతో కూడిన వినతులకు ప్రభుత్వం నుంచి తప్పనిసరి స్పందన లభిస్తుందని వాగ్దానం చేసింది.
మరోవైపు దక్షిణ రాష్ట్రంలోని కార్మికుల నిరంతర డిమాండ్ అయిన పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించడాన్ని పరిశీలిస్తానని విజయ్ హామీ ఇచ్చారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న తాత్కాలిక ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని, పారదర్శక బదిలీ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది మూలవేతనాన్ని రూ.18,000 నుంచి రూ.25,000కు పెంచడంతో పాటు, ‘అధిక ఒత్తిడి భత్యం’ కింద అదనంగా రూ.1,000 ఇస్తామని చెప్పారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటి అనేక హామీలు ఇచ్చారు.
కాగా, ఏప్రిల్ 16న 95 పేజీల మేనిఫెస్టో విడుదల సందర్భంగా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువళ్లువర్ రచించిన తమిళ గ్రంథం ‘తిరుక్కురళ్’లోని సూత్రాలైన ‘అరం’ (సద్గుణం), ‘పొరుళ్’ (సంపద), ‘ఇన్బం’ (ఆనందం) వంటి వాటిపై ఇది ఆధారపడి ఉందని తెలిపారు. ఈ గుణాలే రాజకీయ, పరిపాలనలకు అత్యవసరమైన అంశాలని తెలిపారు. ‘నిజాయితీతో కూడిన పరిపాలనను తన సిద్ధాంతంగా టీవీకే స్వీకరించింది. మా పార్టీ తొలి ఎన్నికల మేనిఫెస్టో కూడా నిజాయితీకి హామీయే. ప్రస్తుత తమిళనాడు సీఎం (స్టాలిన్) లాగా ప్రజలను మేం తప్పుదోవ పట్టించం. ప్రజలకు ఉత్తుత్తి వాగ్దానాలతో కూడిన తొందరపాటు మేనిఫెస్టోను మేం తయారు చేయలేదు’ అని ఆయన అన్నారు.
Also Read:
S A Chandrasekhar | టీవీకేతో చేతులు కలపండి.. కాంగ్రెస్‌కు విజయ్ తండ్రి సూచన
Gaurav Gogoi | జోర్హాట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ.. తొలి ప్రయత్నంలో ఓడిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
Election results | కనిపించని తాళాలు.. ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ లాక్ పగులగొట్టిన అధికారులు