Shashi Tharoor | కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి తన అవసరం లేదనుకుంటే చెప్పాలని.. తన ముందు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ ఆయన హైకమాండ్ (High Command)కు సందేశం పంపడం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఆయన పార్టీ మారడం ఖాయం అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో శశిథరూర్ తాజాగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal)తో సెల్ఫీ తీసుకున్న ఫొటోను శశిథరూర్ మంగళవారం ఉదయం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఆ ఫొటోలో బ్రిటీష్ వ్యాపార, వాణిజ్య శాఖ కార్యదర్శి జోనాథన్ రేనాల్డ్స్ కూడా ఉన్నారు. ఈ ఫొటో భారత్ – యూకే వాణిజ్య ఒప్పందంపై చర్చ సందర్భంగా తీసుకున్నట్లు శశిథరూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, కాంగ్రెస్ కార్యకర్తలు శశిథరూర్ బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ మాట్లాడుకుంటున్నారు.
Good to exchange words with Jonathan Reynolds, Britain’s Secretary of State for Business and Trade, in the company of his Indian counterpart, Commerce & Industry Minister @PiyushGoyal. The long-stalled FTA negotiations have been revived, which is most welcome pic.twitter.com/VmCxEOkzc2
— Shashi Tharoor (@ShashiTharoor) February 25, 2025
ప్రధాని మోదీని, కేరళ (Kerala)లోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని శశిథరూర్ పొగడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శశిథరూర్‌పై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో శశిథరూర్ స్పందిస్తూ.. తాను ఇప్పటికీ పార్టీకి అందుబాటులోనే ఉన్నానని చెబుతూనే వార్నింగ్ ఇచ్చారు. తన అవసరం లేదని పార్టీ భావిస్తే తనకూ వేరే ఆప్షన్లు ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు ‘ఐఈ మలయాళం’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు.
‘కేరళ కాంగ్రెస్‌లో నాయకత్వ శూన్యత ఉంది. ఈ విషయమై నా అభిప్రాయాలను పార్టీ ఇతర నేతలూ సమర్థించారు. కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ తన బేస్‌ను విస్తరించాల్సిన అవసరముంది. రాష్ట్ర నాయకత్వ రేసులో నేను అందరికంటే ముందున్నాను. కొన్ని సంస్థల పోల్‌లో ఈ విషయం స్పష్టమైంది. కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని విస్తరించకపోతే వచ్చే ఎన్నికల్లో మూడోసారి ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుంద’ని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం కావడాన్ని కూడా శశిథరూర్ ప్రశంసించారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన విమర్శలు ఎదుర్కోవడానికి కారణమైంది. అయితే శశిథరూర్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి తన అభిప్రాయాలను తెలియజేసే హక్కు తనకు ఉందని ఆయన చెప్పారు.
‘పార్టీ నేను కావాలని కోరుకుంటే పార్టీ కోసం పనిచేస్తా. వద్దనుకుంటే నేను చేసుకునే సొంత పనులు చాలా ఉన్నాయి. కాలం గడపడానికి నాకు ఎలాంటి వ్యాపకాలు లేవని మీరు అనుకోవద్దు. నాకు చాలా వ్యాపకాలు ఉన్నాయి. పుస్తకాలున్నాయి. ప్రసంగాలున్నాయి. నా స్పీచ్ కోసం ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానాలు ఉన్నాయి.’ అని శశిథరూర్ కాంగ్రెస్‌కు ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు.
Also Read..
Maha Kumbh | రేపే చివరి అమృత్‌స్నానం.. నో వెహికల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్
Maha Kumbh | మహాకుంభమేళాలో గిన్నిస్ రికార్డు లక్ష్యంగా.. పారిశుద్ధ్య కార్మికుల క్లీన్ డ్రైవ్