Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) చివరి దశకు చేరింది. రేపటితో ఈ మహాకుంభమేళా ముగియనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళ్తున్నారు. చివరి అమృత్ స్నానం (final Amrit Snan) కోసం కోటి మందికిపైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రయాగ్‌రాజ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది.
ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’ (No Vehicle Zone)గా మారుస్తున్నామని అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు ప్రయాగ్‌రాజ్ మొత్తం ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించారు. యాత్రికులంతా ఈ మార్గదర్శకాలను పాటించాలని, అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.
చివరి రోజు అమృత స్నానాల కోసం కోటి మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లక్నో, ప్రతాప్‌గఢ్ వైపు నుంచి వచ్చే యాత్రికుల కోసం ఫాఫామౌ ఘాట్‌ను నియమించారు. రేవాన్, బండా, చిత్రకూట్, మీర్జాపూర్ వైపు నుంచి వచ్చే వారికోసం ఆరైల్ ఘాట్‌ను రిజర్వ్ చేశారు. కౌశాంబి నుంచి వచ్చే భక్తుల కోసం సంగం ఘాట్‌ను కేటాయించారు.
మరోవైపు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే.. 40 పోలీసు బృందాలు మోటార్‌బైక్‌లపై ఆయా మార్గాల్లో మోహరించారు. ప్రయాగ్‌రాజ్‌ను కలిపే ఏడు ప్రధాన రహదారుల్లో అదనపు డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు విధుల్లో ఉండనున్నారు.
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా.. ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 64 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ఇక చివరి రోజు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
Also Read..
Maha Kumbh | మహాకుంభమేళాలో గిన్నిస్ రికార్డు లక్ష్యంగా.. పారిశుద్ధ్య కార్మికుల క్లీన్ డ్రైవ్
Highway Collapses | ఘోర ప్రమాదం.. హైవేపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి ఇద్దరు మృతి.. షాకింగ్ వీడియో
Earthquake | బంగాళాఖాతంలో భూకంపం.. కోల్‌కతా, భువనేశ్వర్‌ను తాకిన ప్రకంపనలు