బెంగళూరు, సెప్టెంబర్ 30: కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యం పెరగడం, వీసాలపై ఆంక్షల నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు తమ కార్మిక వ్యూహాలపై పునరాలోచన ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్-1బీ వీసాల చార్జీలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ భారం నుంచి బయటపడేందుకు అమెరికన్ కంపెనీలు పని ప్రదేశాలను తమ దేశానికి బదులుగా భారత్‌కే తరలించే యోచనలో ఉన్నాయి. అమెరికాకు చెందిన చాలా కంపెనీలకు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు ఉన్నాయి. ఇవి ఇక్కడ ఆర్థికపరమైన అంశాలతోపాటు పరిశోధన, అభివృద్ధి అంశాలను పర్యవేక్షిస్తున్నాయి.
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్‌లో 1700కుపైగా జీసీసీలు ఉన్నాయి. లగ్జరీ కార్ల డాష్‌బోర్డ్‌ల రూపకల్పన నుంచి ఔషధాల ఆవిష్కరణ వరకు అత్యున్నత సృజనాత్మకతలకు కేంద్రంగా ఉన్నది. అమెరికాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇక్కడి జీసీసీలు సిద్ధంగా ఉన్నాయని డెలాయిట్ ఇండియా భాగస్వామి రోహన్ లోబో పేర్కొన్నారు. అమెరికాలోని చాలా కంపెనీలు ఇదే రీతిగా ఆలోచిస్తున్నాయని ఆయన చెప్పారు. రెండు వేల నుంచి ఐదువేల డాలర్ల వరకు ఉన్న హెచ్-1బీ వీసా దరఖాస్తుల చార్జీలను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల లక్ష డాలర్లకు పెంచింది. ఇది నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులపై ఆధారపడుతున్న పలు అమెరికన్ కంపెనీలకు పెనుభారంగా మారింది.
హెచ్1బీ దరఖాస్తు ఫీజు పెంచిన కొన్ని రోజులకు ఆ వీసా జారీ ప్రక్రియలో మరిన్ని మార్పులు ఉంటాయని అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ తెలిపారు. కొత్త ఫీజు అమలయ్యే ఫిబ్రవరి 2026లోపే ఈ మార్పులు ఉంటాయన్నారు.
విదేశాల నుంచి దిగుమతి అవుతున్న కలపపై 10 శాతం, ఫర్నిచర్, వంటగది, బాత్రూమ్ల్లో వాడే అల్మారాలపై 25శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు ట్రంప్ తాజాగా ప్రకటించారు. పెంచిన టారిఫ్‌లు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి.