న్యూఢిల్లీ, మార్చి 4 : పన్ను ఎగవేతదారుల ఆటకట్టించేందుకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టాన్ని ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది. ఆర్థిక లావాదేవీలలో డిజిటలైజేషన్ విధానం పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ చట్టాన్ని తదనుగుణంగా ఆధునీకరించనున్నది. ఈ మేరకు ఐటీ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఐటీ బిల్లును ప్రతిపాదించనున్నది. ఈ బిల్లు ప్రకారం ఇంతవరకు ఇండ్లు, కార్యాలయాలలో మాత్రమే సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు ఎవరైనా పన్ను ఎగవేస్తున్నారన్న అనుమానం కలిగితే వారి ఈమెయిల్స్, బ్యాంక్ ఖాతాలు, వాణిజ్య లావాదేవీలను కూడా తనిఖీచేసే అధికారం లభించనుంది. ఐటీ చట్టాన్ని ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ స్పేస్ (వీడీఎస్)కు కూడా విస్తరించనుంది. వీడీఎస్లో సామాజిక మాధ్యమాలు, ఈమెయిల్ సర్వర్లు, ఆన్లైన్ బ్యాంక్, పెట్టుబడులు, ట్రేడింగ్ అకౌంట్లు, క్లౌడ్ సర్వర్లు, డిజిటల్ యాప్స్, ఇతర ఆన్లైన్ వేదికలన్నింటినీ చేర్చింది. పన్ను ఎగవేస్తున్నారన్న అనుమానం కలిగితే వారి ఆన్లైన్ కార్యకలాపాలన్నింటినీ తనిఖీ చేసే అధికారం ఐటీ విభాగానికి కల్పించింది. ఐటీ విభాగానికి చెందిన జాయింట్ డైరెక్టరు, అడిషనల్ కమిషనర్లు, ఆదాయపు పన్ను అధికారుల స్థాయి ఉన్న వారికి మాత్రమే ఆన్లైన్ తనిఖీలు చేసే అధికారం కల్పించనుంది.
ఆదాయపు పన్ను శాఖకు కల్పించనున్న అధికారాలు పౌరుల ప్రాథమిక హక్కుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చట్టపరమైన పర్యవేక్షణ లేదా విధానపరమైన రక్షణ లేకపోతే, ఈ కొత్త చట్టం దుర్వినియోగమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని హెచ్చరించారు. ఓ సంస్థకు చెందిన అధికారిపై విచారణ జరిపే క్రమంలో ఐటీ శాఖ ఆ కంపెనీకి చెందిన కీలకమైన సమాచారాన్ని పొందే అవకాశం లేకపోలేదని అంటున్నారు. తమ అంతర్గత కమ్యూనికేషన్లను, ఆర్థిక రికార్డులు ఇక బహిరంగమవుతాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం పన్ను విధానాన్ని ఆధునీకరించడం, నల్లధనాన్ని వెలికితీయడం లక్ష్యంగా ఈ చట్టాన్ని తెస్తున్నప్పటికీ, చట్టబద్ధమైన రక్షణలు లేకుండా ఐటీ శాఖకు విస్తృత అధికారాలు కల్పించడం ద్వారా గోప్యతల ఉల్లంఘనకు, ఏకపక్ష నిఘాకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.