న్యూఢిల్లీ, జూలై 29: విపక్షాలు కొత్తగా ఏర్పాటు చేసుకొన్న ‘ఇండియా’ కూటమికి ఇంకా పూర్తి రూపం రానేలేదు. అప్పుడే కూటమిలో లుకలుకలు ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. ఆగస్టు 1న ప్రధాని మోదీని లోక్మాన్య తిలక్ అవార్డుతో సత్కరించే కార్యక్రమానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ముఖ్య అతిధిగా హాజరుకానుండటం, ఆయన చేతుల మీదుగానే మోదీకి అవార్డుఅందజేయనుండటంపై కూటమి నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. శుక్రవారం ఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన ఇండియా కూటమి ఫ్లోర్‌లీడర్ల సమావేశంలో పలువురు నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ ఫంక్షన్‌కు హాజరు కాకుండా పవార్‌తో మాట్లాడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను కోరినట్టు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్తున్న సమయంలో ప్రధాని మోదీతో పవార్ వేదిక పంచుకోవడం వలన ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్తుందని కొంత మంది ఇండియా కూటమి నేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది.
మరోవైపు బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తిరిగి ఎన్డీయే వైపు రావొచ్చంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఆగస్టులో జరిగే విపక్షాల కూటమి సమావేశానికి దూరంగా ఉండాలని నితీశ్‌కుమార్‌కు ఆయన సూచించడం గమనార్హం. శనివారం అథవాలే విలేకర్లతో మాట్లాడుతూ ‘నితీశ్ మావాడే. ఆయన ఎన్డీయే కూటమిలో ఎప్పుడైనా చేరే అవకాశముంది. ఎన్డీయేలో ఆయన లేని లోటు కనిపిస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. నితీశ్ తనకు మంచి స్నేహితుడని, సుదీర్ఘకాలంగా ఆయనతో మంచి అనుబంధం ఉందని అన్నారు