లక్నో: శారీరక సామర్థ్యం గల భర్త నిరుద్యోగిననే కారణాన్ని చూపి, భార్యకు పోషణ భత్యాన్ని చెల్లించవలసిన బాధ్యత నుంచి తప్పించుకోజాలడని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ కేసులో భార్యకు నెలకు రూ.2,500 తాత్కాలిక భత్యం చెల్లించాలని కుటుంబ కోర్ట్ భర్తను ఆదేశించింది. దీనిపై ఆ భర్త హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది.
భార్యకు, మైనర్ పిల్లలకు ఆర్థిక సాయం చేయడం భర్తకు ఉల్లంఘించడానికి వీలుకానటువంటి బాధ్యత అని స్పష్టం చేసింది. భర్త, శారీరక సామర్థ్యం ఉంటే, శారీరక శ్రమ చేసి అయినా డబ్బు సంపాదించవలసిన అవసరం ఉంటుందని తెలిపింది.
చట్టంలో పేర్కొన్న అనుమతించదగిన కారణాల మేరకు మినహా ఇతర విధాలుగా ఈ బాధ్యత నుంచి భర్త తప్పించుకోవడానికి వీలుకాదని వివరించింది. భరణం కోసం జరిగే ప్రొసీడింగ్స్ ఓ వ్యక్తి అంతకుముందు పాల్పడిన నిర్లక్ష్యానికి ఆ వ్యక్తిని శిక్షించడానికి ఉద్దేశించినవి కాదని పేర్కొంది. నిరాశ్రయురాలైన భార్య దిక్కుతోచని స్థితిలోకి వెళ్లడాన్ని నిరోధించడమే ఈ ప్రొసీడింగ్స్ లక్ష్యమని వివరించింది.