అలహాబాద్, ఏప్రిల్ 17 : కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ శుక్రవారం ఆదేశించింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా కానీ, లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో గానీ దర్యాప్తు చేయించాలని ఆదేశాలు జారీ చేసింది.
రాహుల్ ద్వంద్వ పౌరసత్వంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, దర్యాప్తు జరపాలని తాము చేసిన విజ్ఞప్తిని లక్నోలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు జనవరి 28న తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేశ్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ విచారించింది. రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందనేందుకు తన వద్ద కొన్ని డాక్యుమెంట్లు, ఈ-మెయిల్ ఆధారాలు ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. ద్వంద్వ పౌరసత్వం ఉన్న ఆయనకు భారత ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదని, లోక్సభ సభ్యుడిగా కొనసాగేందుకు అర్హత లేదని పేర్కొన్నారు.