న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో మిలిటరీ ఆపరేషన్ విజయవంతంగా జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పే, బలమైన సందేశాన్ని ఇచ్చే అవకాశాన్ని భారత్ పోగొట్టుకున్నదని ఆయన అన్నారు. అలాగే పహల్గాం ఘటనలో భద్రతా వైఫల్యానికి బాధ్యత ఎవరిదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
‘మన సైన్యం పాకిస్థాన్‌కు శాశ్వతంగా గుణపాఠం నేర్పించగలిగేది. యుద్ధంలో మన ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గిందో తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని అఖిలేశ్ అన్నారు. ఆపరేషన్ మహదేవ్ సహా ప్రతిదాని నుంచి రాజకీయ ప్రయోజనం పొందుతున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. పహల్గాంపై చర్చ జరుగుతున్నప్పుడు సోమవారమే ఉగ్రవాదులు ఎందుకు ఎన్‌కౌంటరయ్యారు? అని ఆయన ప్రశ్నించారు.
పహల్గాం ఉగ్రదాడికి పూర్తిగా నిఘా, రక్షణ వైఫల్యమేనని రాజ్యసభలో విపక్షాలు అధికార పార్టీపై దండెత్తాయి. ఆపరేషన్ సిందూర్, పహల్గాం దాడిపై మంగళవారం జరిగిన చర్చలో మాట్లాడుతూ విదేశీ విధానంలోనే భారత్ పూర్తిగా వైఫల్యం చెందిందని పేర్కొన్నాయి. పహల్గాంలో భద్రతా వైఫల్యానికి హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు.